నేడు జగన్ ఇంటికి షర్మిల.. ఆ తర్వాత ఢిల్లీకి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇంట ఈ రోజు ఆసక్తికర పరిణామాలు జరగబోతున్నాయి.. కుటుంబ సమేతంగా సీఎం జగన్ నివాసానికి వెళ్లనున్నారు వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయానికి వెళ్లనున్న షర్మిల.. తన సోదరుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలవనున్నారు.. తన కుమారుడు రాజారెడ్డి, ప్రియా అట్లూరితో వివాహ నిశ్చితార్థంతో పాటు పెళ్లి వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రికను జగన్‌కు అందజేయనున్నారు.. తన ఇంట్లో జరిగే తొలి శుభకార్యానికి హాజరుకావాలని అన్నకు ఆహ్వానం పలకనున్నారు.. అయితే, గత కొన్నేళ్లుగా అన్నా – చెల్లెళ్ళ మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తుందనే వార్తలు వచ్చాయి.. చివరకు వైఎస్ ఘాట్‌లో నివాళులర్పించే సమయంలోనూ ఇద్దరు విడివిడిగా వెళ్లడం కూడా హాట్ టాపిక్ అయ్యింది.. ఇప్పుడు షర్మిల.. తన అన్నయ్య దగ్గరకు వెళ్తుండడంతో.. ఈ పరిణామాలను ఆసక్తికరంగా గమనిస్తున్నారు ప్రజలు.
పొత్తుల కంటే ముందు ప్రజా సమస్యలపై ఫోకస్ చేశాం
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పొత్తులపై చర్చలు కొనసాగుతూనే ఉన్నా.. అయితే, పొత్తుల కంటే ముందు ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నాం అన్నారు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్.. దేశంలో సుపరిపాలన అందిస్తున్న మోడీ నాయకత్వాన్ని మరొకసారి ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేశామని, అది అనేక సంక్షేమ కార్యక్రమాల అమలుకు పునాదిగా మారిందని సత్య కుమార్ అన్నారు. కేంద్ర అవినీతిలేని పాలన అందిస్తుంటే, రాష్ట్రంలో మాత్రం అవినీతి పాలన సాగుతుందని మండిపడ్డారు. కేంద్రం ఇస్తున్న నిధులతో ఇక్కడి ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకొని పాలన సాగిస్తుందని, వాలంటీర్లు, పోలీసులు లేకుండా వైసీపీ నాయకులు బయటకు రాలేని పరిస్థితి రాష్ట్రంలో ఉందని సత్య కుమార్ ఎద్దేవా చేశారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన సత్యకుమార్.. వికాసిత్ భారత్ సంకల్ప యాత్ర దేశ వ్యాప్తంగా జరుగుతుంది. వంద రోజుల పాటు విజయ సంకల్ప యాత్ర జరుగుతుంది. ఇక్కడ ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకొని చేస్తున్న పరిస్థితిని వివరిస్తాం అని తెలిపారు.. రాష్ట్ర ప్రభుత్వంలో జరిగిన అవినీతి ప్రజలకు తెలియజేస్తున్నాం. సీఎం అసమర్థమతను, ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని ఎత్తి చూపుతాం అన్నారు. పొత్తుల కంటే ముందు ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నాం. వాలంటీర్ లేకుండా పోలీసు లేకుండా బయటకు రాలేని పరిస్థితి ఉందని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు మాయదారి మాటలు చెప్పారు. కానీ, ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ ప్రజల మధ్యకు రాలేకపోతున్నారంటూ ఆరోపణలు గుప్పించారు సత్యకుమార్ రాజు.
ఎవరు ఏ పార్టీలో చేరినా మాకు నష్టం లేదు.. ఆ రెండే జగన్ బలం..
ఎవరు ఎక్కడ ఏ పార్టీలో చేరినా సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు, పాలన వైసీపీ బలం అన్నారు ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి.. ప్రకాశం జిల్లా పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీలో సంక్షేమ పథకాల ద్వారా లబ్దిపొందుతున్న పేదలందరూ వైసీపీని మరోసారి గెలిపించి వైఎస్ జగన్‌ను సీఎంని చేస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. బీసీలకు సీట్లు ఇవ్వటం కోసమే కొన్ని సీట్లు సర్దుబాటు చేయాల్సి వస్తుంది.. ఒకరిద్దరు వెళ్లటం వల్ల మాకేమీ నష్టం లేదన్నారు. కొందరు వారి వ్యక్తిగత కారణాల బయటకు వెళ్తున్నారు.. వెళ్లే వాళ్ల భవిష్యత్తుకు భరోసా ఇచ్చినా వెళ్తున్నారని విమర్శించారు. సీఎం జగన్.. ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు వైవీ సుబ్బారెడ్డి.
ఏపీ బీజేపీపై హైకమాండ్ ఫోకస్.. పొత్తులపై తేల్చేయండి..!
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.. అయితే, పొత్తులపై తేల్చేందుకు సిద్ధం అవుతోంది భారతీయ జనతా పార్టీ.. ఏపీ వ్యవహరాలపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది.. పొత్తులపై వీలైనంత త్వరగా క్లారిటీకి రావాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది.. దీనికోసం ఇవాళ సాయంత్రం విజయవాడకు రాబోతున్నారు బీజేపీ జాతీయ నేత తరుణ్ చుగ్.. రేపు జరిగే బీజేపీ ఏపీ కోర్ కమిటీ భేటీకి హాజరుకానున్నారు తరుణ్ చుగ్. ఇవాళ పదాధికారుల సమావేశం వివరాలు.. పొత్తులపై నేతల అభిప్రాయాలను తరుణ్ చుగ్‌కు ఏపీ బీజేపీ ముఖ్యనేతలు వివరించనున్నారు. కాగా, నేడు ఏపీ బీజేపీ కీలక సమావేశం జరుగుతోంది.. బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి నేతృత్వంలో పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశం నిర్వహిస్తున్నారు.. ఎన్నికల ముందు సమావేశం కావడంతో పొత్తులు, ఎన్నికల వ్యూహలపై కీలకంగా చర్చించనున్నారు.. పొత్తులపై నేతల నుంచి అభిప్రాయాలు స్వీకరించనున్నారు పార్టీ పెద్దలు. టీడీపీతో కలిసి వెళ్లాలా..? వద్దా..? అనే అంశంపై అభిప్రాయాలు స్వీకరించనున్నారు బీజేపీ అగ్ర నేతలు. జనసేన వ్యవహరం పైనా సమావేశంలో ప్రస్తావనకు వచ్చే ఛాన్స్ ఉంది.. సమావేశానికి జాతీయ సహ సంఘటనా కార్యదర్శి శివ ప్రకాష్ హాజరుకాబోతున్నారు. మొత్తంగా ఏపీలో పొత్తుల వ్యవహారం తేల్చేసే దిశగా కసరత్తు చేస్తోంది బీజేపీ.
వైసీపీ నుంచి బరిలోకి ముద్రగడ కోడలు..! అక్కడి నుంచే..!
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయంలో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో మార్పులు, చేర్పులు కొనసాగుతూనే ఉన్నాయి.. కొందరికి టికెట్లు దక్కడం లేదు.. మరికొందరికి సీట్లు మారిపోతున్నాయి.. ఇక, వైసీపీ రెండో జాబితా విడుదలైన తర్వాత.. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కుటుంబం పేరు తెరపైకి వచ్చింది.. ముద్రగడ చిన్న కోడలు సిరిని తుని అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలిపే యోచనలో వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది. ముద్రగడ చిన్న కొడుకు గిరిబాబు భార్యనే ఈ సిరి… ఆమె సొంత ఊరు తుని నియోజకవర్గంలోని ఎస్ అన్నవరం కావడంతో.. సిరిని అదే నియోజకవర్గం నుంచి పోటీకి పెట్టాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే, తుని సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంతరి దాడిశెట్టి రాజాను.. కాకినాడ ఎంపీగా పోటీ చేయించే యోచనలో ఉంది వైసీపీ.. ఈ ప్రపోజల్‌ను ఆయన ముందు పెట్టడంతో.. ఎంపీగా వెళ్లడానికి దాడిశెట్టి ఆసక్తి చూపనట్టు తెలుస్తోంది. కానీ, ఫైనల్‌గా పార్టీ అధిష్టానరం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని ప్రకటించారు. తుని నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు దాడిశెట్టి రాజా. మార్పులు చేర్పుల్లో భాగంగా కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఉండగా.. ఇక ఎంపీ అభ్యర్థిగా ఎవరిని పెడితే బాగుంటుంది అని ఆలోచన చేస్తోంది వైసీపీ అధిష్టానం.. దాడిశెట్టి రాజా.. లోక్‌సభ బరిలో దిగుతారా? లేదా అనే విషయాన్ని పక్కనబెడితే.. ఆది నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్‌గా ఉంటున్న ముద్రగడ్ పద్మనాభం కుటుంబానికి ఓ సీటు ఇవ్వాలని.. అందులో భాగంగానే ముద్రగడ చిన్న కోడలు సిరిని తుని అసెంబ్లీ నుంచి బరిలోకి దించాలని వైసీపీ అధిష్టానం ప్లాన్ చేస్తోంది.
ట్రబుల్ షూటర్‌ని కాబట్టే నన్ను రాజమండ్రి రూరల్‌కి పంపారు..
రామచంద్రాపురం నుంచి ప్రాతినిథ్యం వహిస్తోన్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రాజమండ్రి రూరల్‌కు మారుస్తూ నిర్ణయం తీసుకుంది వైసీపీ అధిష్టానం.. దీనిపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి, రాజమండ్రి రూరల్ వైసీపీ ఇంఛార్జి చెల్లుబోయిన వేణు.. ట్రబుల్ షూటర్ ను కాబట్టి నన్ను రాజమండ్రి రూరల్‌కి పంపించారని తెలిపారు. తొలి సారి రాజమండ్రి రూరల్ లో వైసీపీ జెండా ఎగురుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇక, రామచంద్రపురం లో మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడుకి సపోర్ట్ చేస్తానని ప్రకటించారు. రాజమండ్రి రూరల్ లో 15 ఏళ్లుగా టీడీపీ నే గెలుస్తూ వస్తుంది.. కానీ, ఈ సారి వైసీపీ జెండా ఎగురవేస్తాం అన్నారు. అందరిని కో ఆర్డినేట్ చేసుకుంటాను అని వెల్లడించారు. వైసీపీలో వైఎస్ జగన్ వర్గం ఒకటే ఉంటుంది.. తప్ప.. మరో వర్గం ఉండదని స్పష్టం చేశారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.
హైదరాబాద్ పెట్రోల్ బంకుల్లో కొనసాగుతున్న రద్దీ..
హిట్ అండ్ రన్ యాక్ట్ పుణ్యామా అని రెండో రోజు పెట్రోల్ బంకుల దగ్గర వెహికిల్స్ రద్దీ కొనసాగుతుంది. నిన్న ఒక్కసారిగా వాహనదారులు బంకుల దగ్గరకు చేరుకోవడంతో బంకులో పెట్రోల్ నిల్వలు అయిపోయాయి. రాత్రి పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లు చేరుకోవడంతో బంకుల దగ్గర సరఫరా కొనసాగుతుంది. హైదరాబాద్ నగరంలోని పలు పెట్రోల్ బంక్‌ల వద్ద వెహికిల్స్ పెద్ద ఎత్తున బారులు తీరారు. సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంలో జనాలు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. పెట్రోల్, డీజిల్ దొరుకుతుందో లేదోనని వాహనదారులు ముందు జాగ్రత్త చర్యగా తెల్లవారుజాము నుంచే బంకుల దగ్గరకు చేరుకుంటున్నారు. బంక్‌లు ఇంకా ఓపెన్ కాకముందే వెహికిల్స్ ను వరుసగా కిలోమీటర్ల మేర లైన్లలో నిలబడి ఉన్నారు. ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్ల సమ్మెతో హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత కొనసాగుతుంది. అయితే, జనవరి 1 నుంచి ఆయిల్ ట్యాంకర్ల యజమానులు నిరసనకు దిగడంతో బంకులకు పెట్రోల్, డీజిల్ సరఫరా ఆగిపోయింది. ఇప్పటికే నగరంలో చాలా వరకు పెట్రోల్ బంకులు క్లోజ్ చేశారు. బంకుల ముందు నో స్టాక్ బోర్డులు కనబడుతున్నాయి. అయితే, తెరచి ఉన్న కొన్ని పెట్రోల్ బంకుల ముందు హైదరాబాద్‌లో వెహికిల్స్ పెట్రోల్ కోసం క్యూ కట్టారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా పెట్రోల్ బంకులు మూసి వేయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో తెరచి ఉన్న కొన్ని పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు క్యాన్‌లతో బారులు తీరడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. కొన్ని చోట్ల పెట్రోల్ బంకుల దగ్గర పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇండియా కూటమి కన్వీనర్‌గా నితీష్ కుమార్..!
లోక్‌సభ ఎన్నిలకు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష ఇండియా కూటమి జోరు పెంచుతోంది. మరోవైపు సీట్ల పంపకాలపై ఇండియా కూటమి నేతలు చర్చలు జరుపుతున్న సమయంలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. కూటమికి కన్వీనర్‌గా బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్‌ని నియమొచే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నిర్ణయాన్ని ఆమోదించడానికి ప్రతిపక్ష పార్టీలు ఈ వారంలో వర్చువల్‌గా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదికపై నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్‌లతో మంగళవారం కాంగ్రెస్ చర్చించింది. కూటమిలో ఇతర భాగస్వామ్య పార్టీలతో చర్చించి, వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయమై నిన్న నితీష్ కుమార్ శివసేన(యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రేతో మాట్లాడారు. నితీష్ కుమార్‌ని ఈ పదవికి ఎంచుకునే ఆలోచనను ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కూడా మద్దతు తెలిపినట్టు తెలుస్తోంది.
ఇజ్రాయెల్ పై టర్కీ భారీ చర్య.. 33మంది మొస్సాద్ గూఢచారుల అరెస్టు
గాజా యుద్ధంలో ఇజ్రాయెల్‌పై టర్కీ పెద్ద చర్య తీసుకుంది. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్‌కు చెందిన 33 మంది గూఢచారి ఏజెంట్లను టర్కీలో అరెస్టు చేశారు. మొసాద్‌కు సహాయం చేస్తున్నారనే అనుమానంతో వీరంతా టర్కీలో పట్టుబడ్డారు. మొసాద్‌కు సహాయం చేశారనే అనుమానంతో టర్కీలో 33 మందిని అరెస్టు చేశారు. టర్కీలోని హమాస్‌తో సంబంధం ఉన్న వ్యక్తులను మొసాద్ లక్ష్యంగా చేసుకోవచ్చని టర్కీ భయపడుతోంది. గత వారం ఇరాన్‌లో నలుగురు మొసాద్ ఏజెంట్లకు మరణశిక్ష విధించబడింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని ముస్లిం దేశాలు బహిరంగంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇరాన్, లెబనాన్, టర్కీ సహా పలు ముస్లిం దేశాలు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు వ్యతిరేకంగా ఉన్నాయి. గాజా యుద్ధానికి సంబంధించి చాలా దేశాలు ఇజ్రాయెల్‌తో విభేదిస్తున్నాయి. వీలైనంత త్వరగా గాజాలో ఇజ్రాయెల్ కాల్పుల విరమణను నెలకొల్పాలని ముస్లిం దేశాలు కోరుతున్నాయి.
“సత్యమేవ జయతే”.. సుప్రీం తీర్పుపై గౌతమ్ అదానీ హర్షం..
అదానీ-హిండెన్‌బర్గ్ కేసుపై సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పును వెలువరించింది. అదానీ వ్యవహారంపై విచారణ జరపాలని కోరుతూ పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుల్ని విచారించిన సుప్రీం నవంబర్‌లో తీర్పును రిజర్వ్ చేసి, ఈ రోజు తీర్పును వెలువరించింది. ఈ కేసును విచారించిన సెబీ అదానీ గ్రూప్‌కి క్లీన్ చిట్ ఇచ్చింది. సెబీ విచారణను సుప్రీంకోర్టు సమర్థిస్తూ.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)కి కేసు బదిలీ చేసేందుకు నిరాకరించింది. సుప్రీంకోర్టు తీర్పుపై అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ హర్షం వ్యక్తం చేశారు. ‘‘ సత్యం గెలిచింది. గౌరవ సుప్రీంకోర్టు మరోసారి నిరూపించింది. సత్యమేవ జయతే. మాకు అండగా నిలిచిన వారికి కృతజ్ఞుడిని. భారతదేశ వృద్ధిలో మా సహకారం కొనసాగుతుంది. జైహింద్’’ అని ఎక్స్(ట్విట్టర్)లో ట్వీట్ చేశారు. ఈ రోజు తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు… అదానీ-హిండెన్‌బర్గ్ కేసుపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) విచారణలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. జార్జ్ సోరోస్ నేతృత్వంలోని ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (OCCRP) నివేదిక సెబీ నుంచి సిట్‌కి దర్యాప్తు బదిలీ చేయడానికి ప్రామాణికం కాదని తీర్పులో పేర్కొంది.
బీసీసీఐ కీలక నిర్ణయం.. తేలిపోనున్న కోహ్లీ, రోహిత్ టీ20 భవితవ్యం..!
టీ20 ప్రపంచకప్-2024 ఆరంభానికి ముందు భారత్ జట్టుకు కేవలం మూడే మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. సొంతగడ్డపై అఫ్గానిస్తాన్‌తో జనవరి 11 నుంచి ఇందుకు సంబంధించిన సిరీస్ స్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్టార్ బ్యాటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, రన్‌మెషీన్ విరాట్ కోహ్లీల అంతర్జాతీయ టీ20 భవితవ్యంపై వారిద్దరితో కూలంకషంగా చర్చించేందుకు రెడీ అవుతున్నాడు. అఫ్గాన్ తో సిరీస్‌కు వీరు అందుబాటులో ఉంటారా? లేదా? అన్న విషయంపై క్లారిటీ తీసుకునేందుకు అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ చూస్తుంది. కాగా, ఈ మెగా టోర్నీకి ముందు జరుగనున్న ఈ సిరీస్‌కు టీమ్ ను ప్రకటించే అంశంపై హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌తోనూ బీసీసీఐ సెలక్షన్ కమిటీ చర్చించనుంది. కాగా టీ20 ప్రపంచకప్-2022 తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇప్పటి వరకు ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు.. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం జరిగే వరల్డ్‌కప్-2024 ఆడతారా లేదా అన్న అంశంపై సందిగ్దత కొనసాగుతుంది. ఐపీఎల్ రూపంలో పొట్టి ఫార్మాట్లో వీరు ఫామ్‌లోనే ఉన్నప్పటికి.. 2024 సీజన్ తర్వాత భారత టీ20 జట్టుతో చేరతారా? లేదంటే అంతకంటే ముందే అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌కు అందుబాటులోకి వస్తారా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
ఎన్టీఆర్ నమ్మకం విలువెంతో నిరూపిస్తాడు కొరటాల…
తెలుగు సినిమా పంథాని మార్చిన వాడు రామ్ గోపాల్ వర్మ అయితే రెగ్యులర్ కమర్షియల్ సినిమాల పంథా మార్చింది మాత్రం డెఫినెట్ గా కొరటాల శివ మాత్రమే. స్టార్ హీరో చేసే రెగ్యులర్ కమర్షియల్ సినిమాకి శంకర్ స్టైల్ లో సోషల్ కాజ్ ని కలుపుతూ కథని నడిపించడం కొరటాల శివ స్టైల్ ఆఫ్ రైటింగ్. ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు… ఇలా ఏ స్టార్ హీరోతో సినిమా చేసినా అభిమానుల కోసం మాస్ స్టఫ్ ఇస్తూనే సోషల్ కాజ్ టచ్ ఇవ్వడం మాత్రం కొరటాల శివ ఏ రోజు వదలలేదు. సింపుల్ గా చెప్పాలి అంటే మాస్ లందు కొరటాల మార్క్ మాస్ వేరయా అన్నట్లు కమర్షియల్ సినిమాలకి కొత్త అర్ధం చెప్పాడు కొరటాల శివ. నాన్-బాహుబలి హిట్ ఇచ్చిన కొరటాల శివ లాంటి రైటర్ డైరెక్టర్ ని ఒక్క సినిమా కిందకి లాగేసింది. ఆకాశం అంత ఎత్తులో ఉన్న కొరటాలని పాతాళానికి పడేసింది. ‘ఆచార్య’… చిరు హీరోగా చరణ్ గెస్టు రోల్ లో నటించిన ఈ మూవీ కొరటాల శివని ఎవరు కలలో కూడా ఊహించనంత డౌన్ ఫాల్ లోకి తీసుకోని వెళ్లింది. ఆచార్య రిలీజ్ అయిన రోజు నుంచి కొన్ని నెలల పాటు కొరటాల శివ అసలు బయట కనిపించకుండా పోయాడు అంటే ఆన్-లైన్ ఆఫ్-లైన్ లో ఎంత ట్రోలింగ్ ఫేస్ చేసాడో అర్ధం చేసుకోవచ్చు. చిరు లాంటి హీరోకి ఆచార్య లాంటి ఫ్లాప్ ఇచ్చిన తర్వాత, అంత నష్టాలని మిగిలించిన తర్వాత ఏ దర్శకుడికి అయినా ఇంకో సినిమా రావాలి అంటే చాలా సమయం పడుతుంది. ఇది చాలదన్నట్లు అప్పటికే ఓకే చేసిన సినిమాలు కూడా క్యాన్సిల్ అవుతాయి. ఇది ఇండస్ట్రీ సత్యం… కానీ ఎన్టీఆర్ అలా చేయలేదు. కొరటాల శివని నమ్మాడు.
మహేష్ ఇలా చూడాలి అనుకున్న వాళ్లు థియేటర్స్ కి వచ్చేయండి… రికార్డులు సెట్ చేద్దాం
ఇస్త్రీ చొక్కా కూడా నలగకుండా, స్టైల్ గా కనిపిస్తూ… కొంచెం మెసేజ్ ఇచ్చే మహేష్ బాబు సినిమాలని చూసి చూసి… అయ్యో ఇది కాదు మా మహేష్ బాబు అంటే మా మహేష్ మాస్ రేంజే వేరు, అలాంటి మహేష్ బాబుని మిస్ అయిపోతున్నామే అనుకుంటున్న ప్రతి ఒక్కరూ జనవరి 12న థియేటర్స్ కి వచ్చేయండి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ వింటేజ్ మహేష్ బాబుని గుర్తు చేస్తూ గుంటూరు కారం సినిమా చేసాడు. ఈ మూవీలో మహేష్ బాబు మాస్ కి కేరాఫ్ అడ్రెస్ లా కనిపిస్తున్నాడు. ఇలాంటి మహేష్ బాబుని చూసి చాలా కాలమే అయ్యింది. ప్రమోషనల్ కంటెంట్ తోనే ఫ్యాన్స్ కి కిక్ ఇస్తున్న గుంటూరు కారం మేకర్స్, థియేటర్స్ లో పూనకాలు తెప్పించడం గ్యారెంటీ. తలకి రుమాలు కట్టి, బీడీ నోట్లో పెట్టి, చొక్కా గుండీలు వదిలేసిన మహేష్ బాబుని జనవరి 12న చూడబోతున్నాం. పోకిరీ తర్వాత దాదాపు అదే రేంజ్ మాస్ ని ఘట్టమనేని అభిమానులకి మళ్లీ పరిచయం చేయబోతున్నాడు మహేష్. అప్పుడు పండు గాడు ఇండస్ట్రీ హిట్ కొడితే ఇప్పుడు రవణగాడు బాక్సాఫీస్ కి బొమ్మ చూపించబోతున్నాడు. ఇప్పటివరకు ‘పెను తుఫాన్ తలొంచి చూస్తే’, ‘దైవం మానుష్య రూపేణా’ అంటూ మహేష్ ని త్రివిక్రమ్ ప్రెజెంట్ చేస్తే సరైన హిట్ ఇవ్వలేదు ఆడియన్స్. అందుకే ఈసారి ఏకంగా కుర్చీని మడతపెట్టి వస్తున్నారు. సంక్రాంతి సీజన్ లో పక్కాగా హిట్ కొట్టే మహేష్ బాబు ఈసారి గుంటూరు కారం సినిమాతో నాన్-రాజమౌళి రికార్డ్స్ ని బ్రేక్ చేసి కొత్త హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాడు. మరి మహేష్ మాస్ మేనియా ఏ రేంజులో ఉంటుంది? ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడు? అనేది తెలియాలి అంటే జనవరి 12 వరకూ వెయిట్ చేయాల్సిందే.