ఎంఎస్‌ఎంఈ పాలసీ-2024ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.. ముఖ్యాంశాలు ఇవే..
చిన్న మధ్యతరహా పరిశ్రమ పాలసీని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఎంఎస్‌ఎంఈ పాలసీ-2024ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. మాదాపూర్ శిల్పకళా వేదికగా ఎంఎస్‌ఎం పాలసీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. ఈ పాలసీని సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారాలు, పెట్టుబడుల విస్తరణకు వీలుగా పరిశ్రమల అవసరాలు, ప్రయోజనాలకు అనుగుణంగా నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తామని సీఎం ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికాలో వ్యాపార అవకాశాలన్నీ మన రాష్ట్రంలోనే ఉన్నాయని, చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలనే సంకల్పంతో నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకురాబోతున్నామని ప్రకటించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కొత్తగా ఆరు విధానాలను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. పారిశ్రామిక అభివృద్ధికి ఎంఎస్‌ఎంఈ పాలసీ, ఎగుమతి విధానం, కొత్త లైఫ్ సైన్సెస్ పాలసీ, రివైజ్డ్ ఈవీ పాలసీ, మెడికల్ టూరిజం పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ అనే ఆరు కొత్త పాలసీలను ఖరారు చేయాలని గత సమీక్షలో ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం MSME పాలసీని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవా టికెట్లు విడుదల
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్. భక్తుల కోసం డిసెంబర్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జితసేవల, దర్శన టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేసింది. ఆర్జిత సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఈ-సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ కోసం ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. లక్కీడిప్ టికెట్లు పొందిన భక్తులు 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు డబ్బులు చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా.. ఈ నెల 21న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. వర్చువల్ సేవా టికెట్లను కూడా అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. అలాగే 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లను విడుదల చేస్తామని పేర్కొన్నారు. శ్రీవాణి ట్రస్టు టికెట్లను ఉదయం 11 గంటలకు, వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్లను మధ్యాహ్నం 3గంటలకు ఆన్‌లైన్‌లో టోకెన్ల కోటాను విడుదల చేయనున్నారు. 24న ఉదయం 11గంటలకు రూ.300 శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు, మధ్యాహ్నం 3గంటలకు తిరుపతి, తిరుమలలో గదుల కోటాను విడుదల చేయనున్నారు. శ్రీవారి సేవ కోటా టికెట్లను ఈనెల 27వ తేదీ ఉదయం గంటలకు విడుదల చేయనున్నారు. అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ, మధ్యాహ్నం ఒంటి గంటకు పరకామణి సేవా కోటా విడుదల చేస్తారు. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని భక్తులను టీటీడీ కోరింది.
తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి స్టాలిన్..
తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ను నియమించే అవకాశం ఉందని ఈరోజు (బుధవారం) డీఎంకే వర్గాలు తెలిపాయి. సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ప్రస్తుతం రాష్ట్ర క్రీడలు, యువజన సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. రాబోయే 24 గంటల్లో ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. అయితే, ఈ నెల ప్రారంభంలో ఎంకే స్టాలిన్ యూఎస్ పర్యటనకు ముందే ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రి పదవికి ఎదగాలని సూచించాడు. కాగా, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి రాజకన్నప్పన్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. విద్య, వైద్యం రెండు కళ్లలాంటివన్నారు. ఇక, ముఖ్యమంత్రి విద్యను ఎంతగానో ఆదరిస్తారని.. స్కిల్ డెవలప్‌మెంట్ అనే శాఖ ఉంటేనే ప్రయోజనం.. ఇది మా ఉపముఖ్యమంత్రి పరిధిలోకి వస్తుంది– క్షమించండి, మా మంత్రి ఉదయనిధి స్టాలిన్ ని ఆగష్టు 19వ తేదీకి ముందు అలా పిలవలేము అని పేర్కొన్నారు. అయితే, క్రీడలు- యువజన సంక్షేమ శాఖ మంత్రితో పాటు ప్రత్యేక కార్యక్రమాల అమలుకు సంబంధించిన కీలక శాఖను కూడా ఉదయనిధి స్టాలిన్ నిర్వహిస్తున్నారు. చెన్నై మెట్రో రైలు ఫేజ్-2 లాంటి కీలక ప్రాజెక్టుల అమలు తీరును ఆయన పరిశీలించి సమీక్షించారు.
సీఎంతో మరోసారి చర్చలు జరపాలి.. బెంగాల్ డాక్టర్స్ డిమాండ్..!
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ పై హత్యాచార ఘటన తీవ్ర ప్రకంపనలు రేపుతుంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో చర్చలు జరిపిన వైద్యులు తమ నిరసనలు ఇంకా కొనసాగిస్తున్నారు. మరికొన్ని డిమాండ్లను వినిపించేందుకు మరోసారి ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బాధితురాలికి పూర్తిగా న్యాయం జరిగేంత వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఇక, ఆరోగ్య కార్యదర్శిని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు (బుధవారం) ఉదయం నుంచి రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రధాన ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు. మా డిమాండ్లు పూర్తిగా నెరవేరేంత వరకు ఈ నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని డాక్టర్లు హెచ్చరించారు. కోల్‌కతా ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎన్‌ఎస్ నిగమ్‌ను వెంటనే డ్యూటీ నుంచి తొలగించాలి అన్నారు. అంతేకాక ప్రభుత్వ ఆస్పత్రుల్లో సురక్షిత వాతావరణం కల్పించాలి అని వారు డిమాండ్ చేశారు. ఆరోగ్య వ్యవస్థను పునర్నిర్మించడం అసవరం అని చెప్పుకొచ్చారు. మరికొన్ని డిమాండ్లను వినిపించేందుకు ముఖ్యమంత్రితో మరోసారి చర్చలకు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు వెల్లడించారు. కాగా, ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో మరో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్‌కు మెయిల్ పంపినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో డాక్టర్లకు కల్పించే భద్రతతో పాటు ప్రభుత్వం కేటాయించిన 100 కోట్ల రూపాయలను ఎలా ఖర్చు చేయాలనుకుంటున్నారనే అంశాలపై సమగ్రంగా చర్చించాలని వారు కోరారు. కాగా, జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన పశ్చిమ బెంగాల్ రాజకీయాలను కుదిపేస్తుంది. ఈ ఘటనను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న డాక్టర్లతో రాష్ట్ర సీఎం మమతా చర్చలు జరిపారు.
ఢిల్లీలో కూలిన రెండంతస్తుల భవనం..
దేశ రాజధాని ఢిల్లీలో ఓ భవనం కుప్పకూలిపోయింది. కరోల్‌బాగ్‌లోని ప్రసాద్ నగర్ ఏరియాలో రెండంతస్తుల నివాస భవనంలోని ఓ భాగం ఈరోజు (బుధవారం) కూలింది. దీంతో అనేక మంది శిథిలాల కింద చిక్కుకుని పోయారు. ఇక, సమాచారం అందుకున్న ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు కొనసాగిస్తుంది. ఈ రెస్క్యూ ఆపరేషన్ లో ఎన్టీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎప్ టీమ్స్ కూడా పాల్గొన్నాయి. అయితే, ఇప్పటి వరకు ఏడుగురిని రెస్య్కూ టీమ్స్ రక్షించాయి. కాగా, ఇటీవల దేశ రాజధానిలో భారీ వర్షాలు కురిశాయి. వర్షాల కారణంగానే ఈ బిల్డింగ్ కుప్పకూలినట్లు అధికారులు పేర్కొన్నారు. గత నెలలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఢిల్లీలోని మోడల్ టౌన్‌లో భారీ వర్షాల వల్ల పునర్నిర్మాణం కోసం కూల్చివేస్తున్న శిథిలమైన భవనం కూలిపోవడంతో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
2026లో జరిగే తమిళనాడు ఎన్నికల్లో గెలుస్తాం.. వారిపై నమ్మకం ఉంచండి..!
ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) సేవలు మరో శతాబ్దానికి అవసరం.. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి అపూర్వ విజయాన్ని అందించాలని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ పార్టీ కార్యకర్తలను కోరారు. డీఎంకే పార్టీ ఏర్పాటై 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా సెప్టెంబర్ 17వ తేదీ మంగళవారం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి స్టాలిన్ మాట్లాడుతూ.. ‘మేం 25, 50, 75వ వార్షికోత్సవాలు జరుపుకున్నప్పుడు మా పార్టీ అధికారంలో ఉందన్నారు. మనం 100వ జయంతి జరుపుకునే సమయంలో డీఎంకే అధికారంలో ఉంటుంది అని ఆయన చెప్పుకొచ్చారు. మా తదుపరి లక్ష్యం 2026 ఎన్నికలే అని డీఎంకే చీఫ్ అన్నారు. మహిళలు, మైనారిటీలు, సమాజంలోని ఆర్థికంగా బలహీన వర్గాల సాధికారత కోసం తాము పని చేస్తామని సీఎం స్టాలిన్ చెప్పుకొచ్చారు. ఇక, తమిళనాడు రాష్ట్ర స్వయంప్రతిపత్తిని అందించడానికి కేంద్ర ప్రభుత్వం పాలనలో లేనందున మేము ఇంకా మా కలలను నెరవేర్చుకోలేదు అని సీఎం ఎంకే స్టాలిన్ తెలిపారు. డీఎంకే ఇప్పటికీ దానిని సాధించడానికి ప్రయత్నిస్తోంది.. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)పై కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కొద్దిపాటి నిధుల ప్రవాహం ఉన్నప్పటికీ.. విభిన్న రంగాలలో గణనీయమైన విజయాన్ని సాధస్తున్నామని చెప్పారు. పూర్తి ఆర్థిక కేటాయింపులు జరిగితే తమిళనాడును దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దగలం అని ముఖ్యమంత్రి స్టాలిన్ వెల్లడించారు.
అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో కొత్త హెలిపోర్ట్ నిర్మిస్తున్న చైనా..
అరుణాచల్ ప్రదేశ్‌లోని సున్నితమైన ‘ఫిష్‌టెయిల్స్’ ప్రాంతానికి సమీపంలో వాస్తవ నియంత్రణ రేఖకు తూర్పున 20 కిలోమీటర్ల దూరంలో కొత్త హెలిపోర్ట్ ను డ్రాగన్ కంట్రీ నిర్మిస్తుంది. మారుమూల ప్రాంతంలోకి సైనికు వేగంగా తరలించే సామర్థ్యాన్ని చైనా సాయుధ దళాలు రెడీ చేసుకుంటున్నాయి. టిబెట్ అటానమస్ రీజియన్‌లోని న్యింగ్‌చి ప్రిఫెక్చర్‌లోని గోంగ్రిగాబు క్యూ నది ఒడ్డున ఈ హెలిపోర్ట్ నిర్మిస్తున్నట్లు పలు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దీని వల్ల భారతదేశానికి పెద్ద ముప్పుగా భావించొచ్చు అన్నమాట. ఇక, ఈఓఎస్ డేటా అనలిటిక్స్‌లో అందుబాటులో ఉన్న ఓపెన్-సోర్స్ శాటిలైట్ ఇమేజరీ 2023 డిసెంబర్ 1వ తేదీ వరకు హెలిపోర్ట్ నిర్మిస్తున్న ప్రదేశంలో ఎలాంటి నిర్మాణం జరగలేనట్లు ఉంది. కానీ, డిసెంబర్ 31 నాటి తదుపరి ఉపగ్రహ చిత్రం, నిర్మాణం కోసం భూమిని క్లియర్ చేయడం కనబడుతుంది. 2024 సెప్టెంబరు 16వ తేదీన చిత్రీకరించబడిన తాజా మ్కాక్సర్ -మూలంలోని అధిక- రిజల్యూషన్ చిత్రాలు అధునాతనమైన హెలిపోర్ట్ నిర్మాణాన్ని సూచిస్తున్నాయి. కాగా, నిర్మాణంలో ఉన్న హెలిపోర్ట్‌లో 600-మీటర్ల రన్‌వేను కలిగి ఉంది. ఇది హెలికాప్టర్‌ల టేకాఫ్‌లను రోలింగ్ చేయడానికి ఉపయోగించవచ్చు.. హెలికాప్టర్‌లు ఉపయోగించడానికి తక్కువ విద్యుత్ అందుబాటులో ఉన్న ఎత్తైన ప్రదేశాలలో ఈ సాంకేతికత ఉపయోగించబడుతుంది. ఈ ప్రాంతంలో సాధారణ ఎత్తు 1500 మీటర్ల (సుమారు 5000 అడుగులు) పరిధిలో ఉంది. కాగా, ఈ కొత్త హెలిపోర్ట్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) గూఢచార సేకరణ, నిఘా కార్యకలాపాలను తీవ్రతరం చేయడానికి పని చేస్తుందని ఇంటెలిజెన్స్ నిపుణులు అంటున్నారు. ఆకస్మిక సమయంలో త్వరితగతిన దళాలను నిర్మించడానికి వీలుగా ఈ హెలిపోర్ట్ నిర్మాణం చేస్తున్నట్లు సమాచారం. మారుమూల ప్రదేశాలకు చైనా సైనికులను చేర్చేలా ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇందులో మూడు హ్యాంగర్‌లు, హెలికాప్టర్‌లను ఉంచడానికి వీలుగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సౌకర్యంతో పాటు అనుబంధ భవనాల నిర్మాణాలు కూడా కొనసాగుతున్నాయి.
జానీ మాస్టర్‌కు పోలీసుల నోటీసులు.. పరారీలో జానీ
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక ఆరోణలు నేపథ్యంలో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసినసంగతి తెలిసిన విషయమే. 2017 లో డీషోలో జానీ మాస్టర్ కు పరిచయమైంది, ఆ తర్వాత 2019లో జానీ మాస్టర్ టీం లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా జాయిన్ అయ్యాను, ఓ షో కోసం జానీ మాస్టర్ తో పాటు మరో ఇద్దరితో కలిసి ముంబైకి వెళ్ళినప్పుడు ముంబైలోని హోటల్లోఅత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బయటికి ఎవరికీ చెప్పవద్దు అంటూ బెదిరించారు, అదే మాదిరిగా షూటింగ్లో సమయంలో అతను చెప్పినట్లుగా వినకపోతే అసభ్యంగా ప్రవర్తించేవాడు మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలంటూ బలవంతం చెసాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది యువతి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా యువతిని విచారించిన పోలీసులు ‘జానీ మాస్టర్ కోరికలకు యువతి ఒప్పుకోకపోవడంతో బాధితురాలు జుట్టు పట్టుకొని జానీ మాస్టర్ దాడి చేశాడని, అలాగే ఆగస్టు 28న బాధితురాలికి ఒక వింత పార్శిల్ వచ్చింది, పేరు లేకుండా వచ్చిన ఆ పార్సిల్ తెరిచి చూడగా దాని లోపల ‘ Congratulations for son be care full’ అని రాసి ఆమె ఇంటి తలుపుకు వేలాడతీసాడని’ పోలీసులు FIR లో పేర్కొన్నారు. జానీ ప్రస్తుతం ఎవరికీ అందుబాటులోకి లేడని, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎవరికి సమాచారం ఇవ్వకుండా తప్పించుకున్నాడుని తెలిసింది. కేసు దర్యాపు వేగవంతం చేసిన నార్సింగి పోలీసులు తాజాగా జానీ మాస్టర్ కు నోటీసులు ఇచ్చారు, విచారణకు రావాలని, వీలైనంత త్వరగా తమ ముందు హాజారుకావాలని నోటిసుల్లో పేర్కొన్నారు పోలీసులు. మరోవైపు కొరియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి జానీని తొలగించారు.