ఏడాదిలో 24 ఏకాదశులు ఉండగా.. ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘తొలి ఏకాదశి’ అంటారు. దీనినే శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు. ఈ కాలాన్ని చాతుర్మాసంగా పిలుస్తారు. హిందూ మతంలో ఈ రోజు అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. భక్తులు ఈ రోజు ఉపవాసం ఉండి.. విష్ణువుని పూజిస్తూ మోక్షాన్ని కోరుకుంటారు. శ్రీమహావిష్ణువుకి అత్యంత ఇష్టమైన ఏకాదశి ఇదే. హిందూ సాంప్రదాయం ప్రకారం.. నేటి నుంచి అన్ని పండుగలు ప్రారంభమవుతాయి.
పూజకు శుభ సమయం:
ఈరోజు తొలిఏకాదశి పర్వదినం. హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఏకాదశి తిథి జూలై 5 సాయంత్రం 6:58 గంటలకు ప్రారంభమై.. జూలై 6 రాత్రి 9:14 గంటలకు ముగుస్తుంది. అయితే ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు పూజకు శుభ సమయం. తొలి ఏకాదశి నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది.
Also Read: Shubman Gill: శుభ్మన్ గిల్ సెంచరీల మోత.. రికార్డులే రికార్డులు!
పూజా విధానం:
తెల్లవారుజామునే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని తలస్నానం చేయాలి. పసుపు రంగు దుస్తులు ధరించడం మంచిది. పూజా మందిరాన్ని శుద్ధి చేసుకుని.. లక్ష్మినారాయణుల ఫొటోబు శుభ్రంగా తుడిచి గంధం, కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి.. మూడు వత్తులను విడిగా వేసి దీపం వెలిగించాలి. తులసి, చామంతి వంటి పసుపు రంగు పూలతో విష్ణుమూర్తిని పూజించాలి. తెల్ల గన్నేరు, నందివర్ధనం, తుమ్మి, జాజీ పూలు కూడా సమర్పించుకోవాలి.
‘ఓం నమోః నారాయణాయ, ఓం నమోః భగవతే వాసుదేవాయ’ అనే రెండు మంత్రాలు చదువుకుంటూ పూజ చేయాలి. విష్ణుమూర్తికి పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వాలి. తీపి పదార్థాలను స్వామి వారికి నైవేద్యంగా సమర్పించాలి. పూజ ప్రారంభించే ముందు ఈ ఏకాదశి వ్రతాన్ని పూర్తి భక్తితో ఉపవాసం ఉండి ఆచరిస్తాను అని శ్రీమహావిష్ణువు ముందు సంకల్పం చెప్పుకోవాలి. ఇలా తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి.