Telangana Budget:తెలంగాణ ప్రభుత్వం నేడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. ఉదయం 9 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. ఈ మీటింగ్ లోనే.. బడ్జెట్ కు మంత్రి మండలి ఆమోద ముద్ర వేయనుంది. ఈ సారి సుమారు 2.72 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్‌ను ప్రతిపాదించే ఛాన్స్ ఉంది. లోక్‌సభ ఎన్నికల వేళ వచ్చే ఆర్థిక సంవత్సరంలో తొలి మూడు నెలల కాలానికి సంబంధించిన కేటాయింపులే ఈ బడ్జెట్‌లో ఉండబోతున్నాయి. ఆ తర్వాత ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది.
ఇక, ఇవాళ మధ్యాహ్నాం 12 గంటలకు ఓటాన్ అకౌంట్ (ఓట్ ఆన్ అకౌంట్) బడ్జెట్‌ను అసెంబ్లీలో ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టనున్నారు. మరోవైపు శాసన మండలిలో మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు ప్రవేశ పెట్టనున్నారు. అయితే, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో కొత్త ప్రతిపాదనలు లేకుండా కేవలం ఖర్చులు మాత్రమే ఉంటాయని సమాచారం. సాధారణంగా జరిగే ప్రభుత్వ కార్యకలాపాలు, శాఖల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ పంపిణీ లాంటి వాటికి మాత్రమే కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ఆలోచనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. ఇదే విషయాన్ని బీఏసీ సమావేశంలో కూడా చర్చించినట్లు సమాచారం.
Read Also: Elon Musk : ఎలాన్ మస్క్ కు కేంద్రం షాక్.. మీకోసం రూల్స్ మార్చేదేలే
అయితే, నేడు ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ లో సంక్షేమానికి ఎక్కువ నిధులు కేటాయించే ఛాన్స్ ఉంది. ఎన్నికల హామీల్లో భాగంగా ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. వీటిలోని పలు పథకాలకు కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. విద్యుత్, వ్యవసాయం, పంచాయితీరాజ్ తో పాటు పలు శాఖలకు అధికంగా నిధులు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక, ఆర్థిక మల్లు భట్టి విక్రమార్క ఇవాళ ఆర్ధిక మంత్రిగా రాష్ట్ర తొలి పద్దును ప్రవేశ పెట్టబోతున్నారు. అలాగే, భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశ పెట్టడం ఖమ్మం జిల్లా రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించనున్నారు.