Today Stock Market Roundup 21-04-23: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని స్వల్ప లాభాలతో ముగించాయి. ఇవాళ ఉదయం అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వెలువడినప్పటికీ ఆ ప్రభావం ఇండియన్ మార్కెట్‌పై పెద్దగా కనిపించలేదు. దీంతో కీలక సూచీలు లాభాలతోనే ప్రారంభమయ్యాయి.
కానీ.. ఇంట్రాడేలో మాత్రం భారీ లాభాలను పొందలేకపోయాయి. రోజంతా నెగెటివ్ మూడ్‌లో ట్రేడింగ్ జరగటమే దీనికి కారణం. ముఖ్యంగా స్టాక్ మరియు సెక్టార్ అనే అంశాలు ఆధిపత్యం చెలాయించాయి. ఈ నేపథ్యంలో సాయంత్రం ఎట్టకేలకు నామమాత్రపు లాభాలతో ఎండ్ అయ్యాయి.
read more: Sid’s Dairy Farm: స్వచ్ఛమైన పాలకు అచ్చమైన సంస్థ అంటున్న కిషోర్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ
సెన్సెక్స్ 22 పాయింట్లు పెరిగి 59 వేల 655 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 17 వేల 624 పాయింట్ల వద్ద ముగిసింది.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లోని మొత్తం 30 కంపెనీల్లో 14 కంపెనీలు మంచి పనితీరు కనబరచగా మిగతా 16 కంపెనీలు వెనకబడ్డాయి. వ్యక్తిగత షేర్లను పరిశీలిస్తే.. ఐటీసీ మరియు టీసీఎస్ భారీగా రాణించాయి.
మార్కెట్ క్యాప్ విషయంలో ఐటీసీ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీని దాటేసి దేశంలోనే 7వ అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది. రంగాల వారీగా చూస్తే.. ఆటో, మెటల్, రియాల్టీ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. 10 గ్రాముల బంగారం ధర 453 రూపాయలు పడిపోయింది. గరిష్టంగా 60 వేల 50 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.
కేజీ వెండి రేటు 516 రూపాయలు తగ్గి అత్యధికంగా 74 వేల 985 రూపాయలు పలికింది. క్రూడాయిల్ ధర నామమాత్రంగా పాతిక రూపాయలు తగ్గింది. ఒక బ్యారెల్ ముడి చమురు 6 వేల 361 రూపాయలుగా నమోదైంది. డాలరుతో పోల్చితే రూపాయి మారకం విలువ 82 రూపాయల 15 పైసల వద్ద స్థిరపడింది.