Today Business Headlines 22-04-23:
తమిళనాడు పనివేళలు
ప్రైవేట్ కంపెనీలు మరియు ఇండస్ట్రీస్‌లో పనివేళలకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వ అనూహ్య నిర్ణయం తీసుకుంది. వారంలో నాలుగు రోజులు, రోజుకి 12 గంటలు పనిచేసేలా రూపొందించిన ఒక బిల్లును శాసన సభలో ప్రవేశపెట్టింది. అపొజిషన్ పార్టీలు మరియు అధికార కూటమిలోని కొంత మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకత వ్యక్తం చేసినప్పటికీ ఈ బిల్లు పాస్ కావటం విశేషం. వారంలో 4 రోజుల కన్నా ఎక్కువ పనిచేస్తే దానికి తగ్గట్లు శాలరీ ఇచ్చేలా ఈ బిల్లును రూపొందించారు. వారంలోని మొత్తం పనివేళల్లో మరియు సెలవుల్లో మాత్రం ఎలాంటి మార్పూ ఉండదు.
హలీం కన్నా.. బిర్యానీకే..
హైదరాబాదీలు హలీంని మించి బిర్యానీ పట్ల ఆదరణ చూపారు. రంజాన్ నెలలో సహజంగా ఎక్కువ మంది హలీం తినటానికి ఇష్టపడతారు. కానీ.. ఈసారి బిర్యానీకి ఓటేశారు. రంజాన్ నెలలో దాదాపు 10 లక్షల బిర్యానీలకు ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టారు. బిర్యానీతో పోల్చితే హలీంని 4 లక్షల మంది మాత్రమే లైక్ చేసినట్లు సిగ్గీ సంస్థ తెలిపింది. ఈ ఆర్డర్ల సంఖ్య స్విగ్గీకి ఒక్కదానికి వచ్చినవి మాత్రమే కావటం గమనించాల్సిన విషయం. మిగతా ఆన్‌లైన్ ఫుడ్ బుకింగ్ సంస్థలకు వచ్చిన ఆర్డర్లను కూడా కలుపుకుంటే ఈ సంఖ్య చాలా పెద్ద మొత్తంలో నమోదవుతుంది.
‘రిల్’కి రికార్డు లాభాలు
మార్చితో ముగిసిన త్రైమాసికంలో రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మంచి పనితీరు కనబరిచింది. రికార్డు స్థాయిలో లాభాలను ఆర్జించింది. 19 శాతం వృద్ధితో 19 వేల 299 కోట్ల రూపాయల నికర లాభాన్ని నమోదు చేసింది. దీంతో మొత్తం ఆదాయం 2 పాయింట్ ఒకటీ నాలుగు లక్షల కోట్ల నుంచి 2 పాయింట్ ఒకటీ తొమ్మిది లక్షల కోట్ల రూపాయలకు చేరింది. ఆయిల్, పెట్రో కెమికల్ విభాగాలతోపాటు రిటైల్ మరియు టెలికం కార్యకలాపాల నుంచి స్థిరమైన వృద్ధి నెలకొనటం కలిసొచ్చింది.
అప్రెంటీస్‌లకు కేరాఫ్
అప్రెంటీస్‌లకు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా అగ్ర స్థానంలో నిలిచింది. అత్యధిక నియామకాలు ఈ నగరంలోనే జరుగుతున్నాయి. హైదరాబాద్ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, బెంగళూరు ఉన్నట్లు టీమ్‌లీజ్ సంస్థ తన నివేదికలో పేర్కొంది. 14 సిటీల్లోని 24 సెక్టార్లకు సంబంధించిన 597 కంపెనీలపై జనవరి, మార్చి నెలల మధ్య ఈ సంస్థ స్టడీ చేసింది. రానున్న రోజుల్లో అప్రెంటీస్‌ల సంఖ్యను పెంచుకోవాలనుకుంటున్న కంపెనీలు కూడా హైదరాబాద్‌లోనే ఎక్కువ సంఖ్యలో.. అంటే.. 83 శాతం ఉన్నట్లు టీమ్‌లీజ్ తెలిపింది.
బాలెనో కార్లు రీకాల్
వ్యాక్యూమ్ పంప్‌లో లోపాలు ఉండటంతో 7 వేల 213 మారుతీ బాలెనో ఆర్‌ఎస్ కార్లను రీకాల్ చేశారు. లోపాలను సరిచేసేందుకు వెనక్కి పిలిపిస్తున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా తెలిపింది. బ్రేక్ వాడకంలో వ్యాక్యూమ్ పంప్ కీలకమని పేర్కొంది. ఇందులో లోపాలు ఉంటే కొన్ని సందర్భాల్లో బ్రేక్ పెడల్‌పై ఎక్కువ బలం ఉపయోగించాల్సిన అవసరం ఏర్పడుతుందని వెల్లడించింది. 2016 అక్టోబర్ 27 నుంచి 2019 నవంబర్ 1వ తేదీ మధ్యలో తయారైన కార్లలో మార్పులు చేయాల్సి ఉందని స్పస్టం చేసింది.
పెరిగిన ఫారెక్స్ నిల్వలు
ఏప్రిల్ 14వ తేదీతో ముగిసిన వారంలో ఇండియా విదేశీ మారక నిల్వలు 165 పాయింట్ ఏడు కోట్ల డాలర్లు పెరిగాయి. దీంతో మొత్తం నిల్వలు 58 వేల 641 పాయింట్ 2 కోట్ల డాలర్లకు చేరాయి. విదేశీ మారకపు ఆస్తులు సైతం 220 పాయింట్ 4 కోట్ల డాలర్ల మేరకు వృద్ధి చెందాయి. తద్వారా 51 వేల 663 కోట్ల డాలర్లకు పెరిగాయి. ఇదే సమయంలో పసిడి నిల్వలు 52 పాయింట్ 1 కోట్ల డాలర్లు తగ్గి 4 వేల 612 పాయింట్ కోట్ల డాలర్లకు దిగొచ్చాయి.