Today Business Headlines 17-04-23:
డైలీ కరెన్సీ అప్‌డేట్స్
ఇరవై రెండు దేశాల కరెన్సీ మారకపు విలువలను రోజువారీగా సాయంత్రం 6 గంటల లోపు తెలియజేసే ఆటోమేటెడ్ సిస్టమ్‌ను త్వరలోనే ఏర్పాటుచేయనున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ వెల్లడించింది. ఈ రేట్లను ప్రస్తుతం 15 రోజులకొకసారి ఇంటిగ్రేటెడ్ కస్టమ్స్ పోర్టల్‌లో నోటిఫై చేస్తున్నారు. ప్రతి నెలా మొదటి మరియు మూడో గురువారం నమోదు చేస్తున్నారు. కొత్త పద్ధతిలో రోజువారీ మారకపు రేట్లలో అప్ అండ్ డౌన్స్‌ని కరెక్ట్‌గా తెలుసుకొని ఎక్స్‌పోర్టర్ల మరియు ఇంపోర్టర్ల ట్యాక్స్‌లను కచ్చితంగా లెక్కించొచ్చు.
ఇన్సూరెన్స్ టార్గెట్స్
ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన మరియు ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన వంటి ప్రభుత్వ బీమా పథకాల విక్రయాలకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వ రంగ బ్యాంకులకు లక్ష్యాలను నిర్దేశించింది. ముద్ర యోజన మరియు స్టాండప్ ఇండియా తదితర రుణ పథకాలకు కూడా టార్గెట్లు పెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ లక్ష్యాలను చేరుకోవాల్సి ఉంటుంది. జీవన్ జ్యోతి బీమా యోజన కింద 8 పాయింట్ 3 కోట్ల మంది, సురక్షా బీమా యోజన కింద 23 పాయింట్ 9 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు.
మన పెద్ద పార్ట్నర్
2022-23 ఆర్థిక సంవత్సరంలో మన దేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా నిలిచింది. రెండో స్థానంలో చైనా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో భారత్, అమెరికా మధ్య 128 పాయింట్ ఐదు ఐదు బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది. ఈ తాత్కాలిక గణాంకాలను కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరో వైపు.. చైనా రెండో స్థానంలో నిలిచినప్పటికీ ఆ దేశంతో వాణిజ్యం ఒకటిన్నర శాతం తగ్గటం గమనించాల్సిన విషయం. చైనా తర్వాత మూడో స్థానంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నాలుగో స్థానంలో సౌదీ అరేబియా, సింగపూర్ ఉన్నాయి.
కొత్త సెక్టార్‌లోకి
అశోక్ లేల్యాండ్ సంస్థ.. యూజ్డ్ కమర్షియల్ వెహికిల్స్ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మేరకు ‘రీ-ఏఎల్’ పేరుతో ఇ-మార్కెట్ ప్లేస్‌ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా.. ఇప్పుడు వాడుతున్న వెహికిల్‌ని మార్చుకోవటంతోపాటు ట్రక్కు లేదా బస్సుకి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. నచ్చిన వాహనం తీసుకునేందుకు మరియు ఆథరైజ్డ్ డాక్యుమెంట్లు పొందేందుకు ఈ డిజిటల్ సేవలు ఉపయోగపడతాయని అశోక్ లేల్యాండ్ తెలిపింది. ఇతరత్రా ఏమైనా సమస్యలు ఎదురైనా పరిష్కారాలను చూపేందుకు వీలుపడుతుందని సంస్థ ఎండీ అండ్ సీఈఓ షెను అగర్వాల్ చెప్పారు.
వాంటెడ్ ఎక్స్‌పర్ట్స్
మన దేశంలో మరో మూడు నాలుగేళ్లలో 10 లక్షల మందికి పైగా డేటా సైన్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఎక్స్‌పర్ట్‌ల అవసరం ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ఈ గిరాకీ 6 లక్షల 30 వేల మందిగా ఉండగా 4 లక్షల 16 వేల మంది మాత్రమే దొరుకుతున్నారు. దీన్నిబట్టి డిమాండ్, సప్లై మధ్య తేడా 51 శాతంగా ఉంది. ప్రస్తుతం పనిచేస్తున్న డేటా సైన్స్, ఏఐ నిపుణుల సంఖ్య విషయానికొస్తే బెంగళూరు తొలి స్థానంలో ఉంది. ఆ సిటీలో 64 వేల నుంచి 69 వేల మంది వరకు పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. ఆ తర్వాత రెండో స్థానంలో హైదరాబాద్ నిలిచింది.
బ్యాన్ అండ్ ఫైన్
ఆడిటింగ్ సరిగా చేయలేదనే కారణంతో నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ.. దేవన్ హౌజింగ్ ఫైనాన్స్ కార్ప్ లిమిటెడ్.. డీహెచ్ఎఫ్ఎల్‌పై చర్యలు చేపట్టింది. 2017-18 మధ్య కాలంలో తప్పు చేసిన నలుగురు ఆడిటర్లపై ఏడాది పాటు నిషేధం విధించింది. అంటే.. వీళ్లు సంవత్సరం పాటు ఆడిటింగ్ చేయటానికి వీల్లేదు. దీంతోపాటు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున జరిమానా విధించింది. డీహెచ్ఎఫ్ఎల్‌ని ప్రస్తుతం పిరమాల్ క్యాపిటల్ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా వ్యవహరిస్తున్నారు. ఇది పిరమాల్ గ్రూప్ అధీనంలోని ఒక రిజిస్టర్డ్ కంపెనీ.