Today Business Headlines 14-04-23:
కంపెనీల సవరణ చట్టం బిల్లు
కేంద్ర ప్రభుత్వం.. కంపెనీలు మరియు దివాలా చట్టం సవరణ బిల్లులను వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టనుంది. ఈ సమావేశాలు జులై నెల చివరి వారంలో గానీ ఆగస్టు మొదటి వారంలో గానీ జరగనున్నాయి. ఈ విషయాలను కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే.. కంపెనీలు మరియు దివాలా చట్టంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయనున్నారనే అంశాలను మాత్రం ఆయన వెల్లడించలేదు.
తెలంగాణలో.. మరో 14 చోట్ల
రిలయెన్స్ జియో 5జీ సేవలు తెలంగాణ రాష్ట్రంలో తాజాగా మరో 14 టౌన్లలో అందుబాటులోకి వచ్చాయి. ఈ పట్టణాల జాబితాలో కామారెడ్డి, మిర్యాలగూడ, పాల్వంచ, కోరుట్ల తదితర ప్రాంతాలు ఉన్నాయి. దీంతో.. తెలంగాణలో.. ఈ.. ట్రూ 5జీ సర్వీసులు అందుతున్న మొత్తం ఏరియాల సంఖ్య 33కి పెరిగిందని రిలయెన్స్ జియో ప్రకటించింది. 5జీ సేవల విస్తరణలో ఎయిర్‌టెల్, జియో పోటాపోటీగా ముందుకెళుతున్న సంగతి తెలిసిందే.
ఇన్ఫోసిస్.. క్యూ4 ఫలితాలు..
ఐటీ దిగ్గజ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్‌కి గత ఆర్థిక సంవత్సరంలోని నాలుగో త్రైమాసికంలో 37 వేల 441 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇందులో లాభం 6 వేల 128 కోట్ల రూపాయలుగా నమోదైంది. దీంతో ఒక్కో షేరుకి 17 రూపాయల 50 పైసలను డివిడెండ్‌గా ఇవ్వాలని నిర్ణయించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే నికర లాభంలో 7 పాయింట్ 8 శాతం వృద్ధి నెలకొంది. ఇదిలాఉండగా 2022-23 ఆర్థిక సంవత్సరం మొత్తమ్మీద ఇన్ఫోసిస్ ఆదాయం లక్షా 46 వేల 767 కోట్లు రాగా.. లాభం 9 శాతం పెరిగి 24 వేల 95 కోట్ల రూపాయలకు పెరిగింది.
మండిపోయిన.. వెండి ధర..
బులియన్ మార్కెట్‌లో వెండి ధర నిన్న గురువారం సరికొత్త రికార్డు స్థాయికి చేరింది. కిలో వెండి రేటు 400 రూపాయలు పెరిగి ఏకంగా 81 వేల 800 రూపాయలు పలికింది. ముంబై మరియు హైదరాబాద్ రెండు చోట్లా ఇదే పరిస్థితి నెలకొంది. ఢిల్లీలో 11 వందల 10 రూపాయలు పెరిగి 77 వేల 150 రూపాయలకు చేరింది. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఔన్స్ వెండి 25 పాయింట్ ఆరు ఒకటి డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక.. గోల్డ్ విషయానికొస్తే.. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 2027 రూపాయలుగా నమోదైంది.
జీ-20 ఆర్థిక మంత్రుల భేటీ
జీ-20 దేశాల అధ్యక్ష పదవిని ఇండియా చేపట్టాక ఆయా దేశాల ఆర్థికమంత్రులు రెండోసారి సమావేశమయ్యారు. అమెరికాలోని వాషింగ్టన్‌లో జరిగిన ఈ భేటీలో రుణాల ఒత్తిళ్లు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎదురవుతున్న సవాళ్లు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, క్రిప్టోకరెన్సీ, అంతర్జాతీయ పన్ను విధానంలో పారదర్శకత తదితర అంశాల గురించి చర్చించారు. నిన్న గురువారం నిర్వహించిన డే-1 మీటింగులో ఇండియా తరఫున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ పాల్గొన్నారు.
14 వేల కోట్లు దాటిన ‘సిప్’
మ్యూచ్‌వల్ ఫండ్ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ పెట్టుబడులు తొలిసారిగా మార్చి నెలలో 14 వేల కోట్ల రూపాయలు దాటాయి. మన దేశంలో రిటైల్ ఇన్వెస్ట్‌మెంట్లు పెరుగుతున్నాయని చెప్పటానికి దీన్నొక ఉదాహరణగా పేర్కొనొచ్చు. మార్కెట్‌లో ఊగిసలాట ధోరణి నెలకొన్న నేపథ్యంలో కూడా ఇలాంటి సానుకూల పరిణామం చోటుచేసుకోవటం చెప్పుకోదగ్గ విషయం. కార్పొరేట్ బాండ్ స్కీమ్స్ వంటి ఫిక్స్‌డ్ ఇన్‌కం ప్లాన్స్‌లోకి కూడా పెట్టుబడుల ప్రవాహం పెరగటం విశేషం. ఏప్రిల్ నుంచి పన్నుల విధానం మారనుండటంతో ఇన్వెస్టర్లు తమ డబ్బును ఈ ఫండ్స్‌లోకి మళ్లించారు.