Today Business Headlines 06-04-23:
ఆర్బీఐ అనూహ్య నిర్ణయం
అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆర్‌బీఐ నిర్ణయాలు వెలువడ్డాయి. వడ్డీ రేట్లు మరోసారి పెంచకుండా పాత వాటినే కొనసాగిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించిన నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఇవాళ వెల్లడించారు. రెపో రేటును మార్చకుండా ఆరున్నర శాతంగానే అమలుచేస్తామని తెలిపారు. ఆర్‌బీఐ ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని నిపుణులు సైతం అంచనా వేయలేకపోవటం ఆసక్తికరం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య పరపతి విధాన సమీక్ష ఇదే తొలిసారి కావటం గమనించాల్సిన విషయం. మానిటరీ పాలసీ కమిటీ సమావేశాలు ఈ నెల 3వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే.
ఎల్ఐసీకి 65,500 కోట్లు..
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. ఎల్‌ఐసీకి 65 వేల 500 కోట్ల రూపాయల లాభం వచ్చినట్లు ఒక ఇంగ్లిష్ న్యూస్ పేపర్ స్టోరీ రాసింది. మార్చి నెలతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఈ లాభాలు వచ్చినట్లు పేర్కొంది. అత్యధిక మార్కెట్ విలువ కలిగిన పది సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈ ప్రాఫిట్స్ నమోదుచేసినట్లు తెలిపింది. రిలయెన్స్, ఐటీసీ, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎల్ అండ్ టీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్, హెచ్‌యూఎల్ కంపెనీల్లో ఎల్‌ఐసీ ఇన్వెస్ట్‌మెంట్స్ 4 పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్ల రూపాయల వరకు ఉంటాయని అంచనా వేస్తున్నారు.
61 వేలు దాటిన బంగారం
బంగారం విలువ లైఫ్‌టైమ్ హయ్యస్ట్ లెవల్‌కి చేరింది. నిన్న బుధవారం బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల పసిడి రేటు వెయ్యీ 25 రూపాయలు పెరిగింది. తద్వారా 61 వేల 80 రూపాయలకు చేరింది. 61 వేల వద్ద జీవనకాల గరిష్ట స్థాయిని దాటింది. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల వాతావరణం నెలకొనటం దీనికి కారణమని ఎక్స్‌పర్ట్‌లు పేర్కొంటున్నారు. మొన్న మంగళవారం సైతం బంగారం ట్రేడింగ్ 60 వేల 55 రూపాయల వద్ద క్లోజ్ అయింది. తులం బంగారం రేటు హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం 61 వేల 360 రూపాయలకు చేరటం చెప్పుకోదగ్గ అంశం. దేశంలోని దాదాపు అన్ని మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
చేతులు మారిన ‘శాతవాహనా’
పిగ్ ఐరన్‌ని ఉత్పత్తి చేసే హైదరాబాద్ సంస్థ శాతవాహన ఇస్పాత్.. చేతులు మారింది. ఈ కంపెనీని జిందాల్ సా లిమిటెడ్ కొనుగోలు చేసింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్.. ఎన్‌సీఎల్‌టీ.. నిర్వహించిన దివాలా పరిష్కార ప్రక్రియ ద్వారా ఈ బదలాయింపు పూర్తయింది. శాతవాహనా ఇస్పాత్‌ను తిరిగి ప్రారంభించేందుకు జిందాల్ సా సంస్థ చేసిన ప్రపోజల్‌కు ఎన్‌సీఎల్‌టీ ఓకే చెప్పింది. అంతకుముందే రుణదాతల కమిటీ సైతం అంగీకారం తెలిపింది. పునరుద్ధరణలో భాగంగా శాతవాహనా ఇస్పాత్ స్టాక్స్‌ని ఈక్విటీ మార్కెట్ నుంచి తొలగిస్తారు. అనంతరం విలీనం చేసుకుంటారు. శాతవాహనాను దక్కించుకునేందుకు ఆరు సంస్థలు పోటీపడ్డాయి.
మెరిసిన ‘భారత’ మహిళలు
అగ్ర రాజ్యం అమెరికాలోని ఆర్థిక సేవల రంగంలో సైతం భారత సంతతి మహిళలు రాణిస్తున్నారు. వాల్‌స్ట్రీట్ జర్నల్ అనుబంధ సంస్థ బారన్ రూపొందించిన వంద మంది ప్రభావవంతమైన మహిళల జాబితాలో ఐదుగురికి చోటు లభించింది. శక్తిమంతమైన మహిళలుగా నిరూపించుకున్నవాళ్ల పేర్లు.. అను అయ్యంగార్, రూపాల్ జె భన్సాలి, సోనాల్ దేశాయ్, మీనా ప్లిన్, సవితా సుబ్రమణియన్. ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్‌లో అత్యున్నత స్థాయికి చేరటంతోపాటు ఈ రంగం భవితవ్యాన్ని మార్చటంలో వీళ్లు కీలక పాత్ర పోషించారని వాల్‌స్ట్రీట్ అనుబంధ పబ్లికేషన్స్ సంస్థ పేర్కొంది.
బ్యూటీ మార్కెట్‌లోకి రిలయన్స్
రిలయెన్స్ రిటైల్ సంస్థ లేటెస్ట్‌గా బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ ప్రొడక్టుల విభాగంలోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగా.. తిరా అనే పేరుతో ముంబైలో మొట్టమొదటి ఆఫ్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించింది. ఆఫ్‌లైన్ స్టోర్‌ని లాంఛ్ చేసినప్పటికీ ఈ ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయొచ్చని తెలిపింది. ఈ మేరకు వెబ్‌సైట్‌ని మరియు మొబైల్ యాప్‌ని అందుబాటులోకి తెచ్చింది. ఇండియన్ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ మార్కెట్ ఈ సంవత్సరం 2 పాయింట్ రెండు నాలుగు లక్షల కోట్ల రూపాయల స్థాయికి చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సెక్టార్ కంపెనీల మొత్తం ఆదాయంలో 12 శాతానికి పైగా ఇన్‌కం ఆన్‌లైన్ ద్వారా వస్తుందని ఒక స్టడీలో తేలింది.