Today Business Headlines 02-05-23:
జీఎస్టీ వసూళ్లు సూపర్
ఏప్రిల్ నెలలో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వసూళ్లు గతంలో ఎన్నడూలేనంతగా నమోదయ్యాయి. లైఫ్ టైం హయ్యస్ట్ లెవల్‌లో ఒకటీ పాయింట్ ఎనిమిదీ ఏడు లక్షల కోట్ల రూపాయలు వచ్చాయి. ఈ విషయాలను కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. గత ఏడాది ఏప్రిల్‌లో ఒకటీ పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్లు వసూలయ్యాయి. అదే ఇప్పటివరకు అత్యధికం. దాంతో పోల్చుకుంటే 12 శాతం ఎక్కువ కావటం విశేషం. జీఎస్టీ కలెక్షన్లు రికార్డు స్థాయిలో జరగటం పట్ల ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థకు ఇది గొప్ప వార్త అని పేర్కొన్నారు.
వెయ్యి మందికి జాబులు
తక్కువ శాలరీ ఉన్నోళ్లకు పర్సనల్ లోన్లు ఇచ్చే ఫిన్‌టెక్ సంస్థ వివిఫై ఇండియా ఫైనాన్స్.. కొత్తగా వెయ్యి మందికి ఉద్యోగాలు ఇవ్వబోతోంది. డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఎక్స్‌పర్ట్‌లతోపాటు సర్వీస్ సెంటర్లలో పనిచేసేవారికి అవకాశం కల్పించనుంది. పలు పట్టణాల్లో కస్టమర్ కేర్ కేంద్రాలను ఏర్పాటుచేయటం కోసం ఈ నియామకాలు చేపడుతోంది. ఈ స్టార్టప్ కంపెనీ మరో మూడేళ్లలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌కి వెళ్లనుంది. గత ఆర్థిక సంవత్సరంలో వెయ్యి కోట్ల రుణాలు ఇచ్చామని, ఈ సంవత్సరం మూడు వేల కోట్ల రూపాయలను టార్గెట్‌గా పెట్టుకున్నామని వెల్లడించింది.
అగ్రస్థానంలో శామ్‌సంగ్
స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లో శామ్‌సంగ్ సంస్థ మరోసారి అగ్ర స్థానంలో నిలిచింది. 20 శాతం వాటాతో వరుసగా రెండో క్వార్టర్‌లో కూడా టాప్ పొజిషన్‌ని సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని కౌంటర్ పాయింట్ సంస్థ తెలిపింది. 5జీ మోడల్ ఫోన్లలో సైతం శామ్‌సంగ్ తన డామినేషన్‌ని నిరూపించుకుంది. 45 వేల రూపాయలకు పైగా ఖరీదైన స్మార్ట్‌ఫోన్ల విక్రయాల్లో శామ్‌సంగ్ ఏడాది కాలంలోనే ఏకంగా 247 శాతం గ్రోత్ నమోదు చేసింది. స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లో 17 శాతం షేర్‌తో వివో కంపెనీ రెండో స్థానంలో కంటిన్యూ అవుతోంది.
గత నెలలోని ఎఫ్‌పీఐలు
ఏప్రిల్‌తో ప్రారంభమైన నూతన ఆర్థిక సంవత్సరంలో ఫారన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్లు ఆశాజనకంగా ప్రారంభమయ్యాయి. మొదటి నెలలో 11 వేల 630 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. మన దేశ స్టాక్ మార్కెట్‌లో షేర్ల విలువలు పెరగటం, రూపాయి వ్యాల్యూ కూడా సానుకూలంగా ఉండటం దీనికి ప్రధాన కారణం. మార్చి నెలలో సైతం ఎఫ్‌పీఐలు చెప్పుకోదగ్గ స్థాయిలోనే నమోదయ్యాయి. అయితే.. అమెరికా కేంద్ర బ్యాంకు కఠినమైన ద్రవ్య విధానాన్ని అనుసరిస్తున్నందున రానున్న రోజుల్లో ఈ పెట్టుబడుల్లో ఆటుపోట్లు తప్పవని అనలిస్టులు అంటున్నారు.
అన్‌సెక్యూర్డ్ లోన్స్ అలర్ట్
అన్‌సెక్యూర్డ్ లోన్ల విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశీయ బ్యాంకులను అలర్ట్ చేసింది. ఈ రుణాల విలువ గతేడాది ఫిబ్రవరిలో 1 పాయింట్ ఒకటీ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు మాత్రమే కాగా ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి రెండూ పాయింట్ రెండు లక్షల కోట్ల రూపాయలకు చేరినట్లు గుర్తు చేసింది. అమెరికా, యూరప్‌లలో వరుసగా బ్యాంకులు సంక్షోభంలో చిక్కుకుంటూ ఉండటంతో ఆర్‌బీఐ ఈ వార్నింగ్ ఇచ్చింది. పర్సనల్ లోన్లు, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ బకాయిలు, స్మాల్ బిజినెస్ లోన్లు, మైక్రో రుణాలు అన్‌సెక్యూర్డ్ లోన్ల కిందికే వస్తాయన్న సంగతి తెలిసిందే.
గూగుల్ కొలువుకి గుడ్‌బై
కృత్రిమ మేధకు పితామహుడిగా తరచుగా పేర్కొనే జాఫ్రీ హింటన్.. గూగుల్ ఉద్యోగానికి గుడ్‌బై చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వాడకం రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవటం గమనించాల్సిన అంశం. ఏఐ వల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయంటున్న విమర్శల జాబితాలో జాఫ్రీ హింటన్ కూడా చేరుతున్నారు. ఈ విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. జాఫ్రీ హింటన్.. గూగుల్ కంపెనీలో పదేళ్లకు పైగా పనిచేశారు. ఈ రంగంలో ఈయనకు ఎంతో మంచి పేరు ఉండటం విశేషం.