Today (25-01-23) Business Headlines
Airtel మినిమం రీఛార్జ్ రూ.155
Airtel ప్రీపెయిడ్ మినిమం రీఛార్జ్ ఒక్కసారే 57 శాతం పెరిగి 155 రూపాయలకు చేరింది. దీంతో ఇప్పుడున్న 99 రూపాయల ప్లాన్ రద్దయింది. కొత్త ప్లాన్.. ఏపీతోపాటు పలు రాష్ట్రాల్లో అమలవుతుంది. ఇందులో భాగంగా అన్ లిమిటెడ్ కాల్స్, ఒక జీబీ డేటా, 300 ఎస్ఎంఎస్ అందిస్తారు. హలో మ్యూజిక్, వింక్ మ్యూజిక్ సర్వీసులు సైతం ఉచితం. అయితే.. ఈ ప్లాన్ వ్యాలిడిటీ కొంత మందికి 28 రోజులు, మరికొంత మందికి 24 రోజులుగా చూపిస్తుండటం గమనించాల్సిన విషయం.
‘కాఫీ డే’కి రూ.26 కోట్ల ఫైన్
కాఫీ డే సంస్థ కష్టాలు మళ్లీ పెరిగాయి. అప్పుల ఊబి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటోందని భావిస్తున్న తరుణంలో.. గతంలో చేసిన తప్పిదాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా.. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా.. సెబీ.. కాఫీ డే కంపెనీకి 26 కోట్ల రూపాయల జరిమానా విధించింది. 45 రోజుల్లోపు ఈ మొత్తాన్ని చెల్లించాలంటూ గడువు పెట్టింది. 7 అనుబంధ సంస్థల నుంచి కాఫీ డే ప్రమోటర్ సంస్థకు 3 వేల 535 కోట్ల రూపాయలు మళ్లించారని, అవి తర్వాత కాఫీ డే దివంగత అధినేత విజి సిద్ధార్థ మరియు ఆయన కుటుంబ సభ్యులకు బదిలీ అయ్యాయని సెబీ గుర్తించి ఫైన్ వేసింది.
తెర పైకి మరో సూచీ.. ‘ఆటమ్’
ఇండియన్ మార్కెట్’లో మరో ఇండెక్స్ తెర మీదికి వచ్చింది. ఆ సూచీ పేరు ఆటమ్. దీన్నే.. ఐరావత్ టచ్ స్టోన్ మిడ్ క్యాప్ ఇండెక్స్ అని కూడా అంటారు. స్టాక్ ఎక్సేంజ్’లో రిజిస్టరైన 30 మధ్య తరహా సంస్థలే ఇందులో ఉంటాయి. ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు వీలైన మరియు ఉత్తమ పాలన అమల్లో ఉన్న సంస్థలను ఎంపిక చేశారు. ఇండియన్ మ్యూచువల్ ఫండ్ కంపెనీల అసోసియేషన్’లోని 150 మధ్య తరహా సంస్థల నుంచి వీటిని సెలెక్ట్ చేశారు.
‘టాటా ట్రస్ట్’కి కొత్త సీఈఓ, సీఓఓ
టాటా సన్స్ సంస్థలో మెజారిటీ వాటా.. 66 శాతం షేర్ ఉన్న టాటా Trustsకు కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్’గా సిద్ధార్థ్ శర్మ నియమితులయ్యారు. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్’గా అపర్ణ ఉప్పలూరిని సెలెక్ట్ చేశారు. వీళ్లిద్దరూ నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభం రోజు.. ఏప్రిల్ ఒకటిన బాధ్యతలు చేపడతారు. CEO పదవి నుంచి ఎన్.శ్రీనాథ్ గతేడాది చివరలో తప్పుకోవటంతో ఆయన స్థానంలో సిద్ధార్థ్ శర్మను ఎంపిక చేశారు. ఈయన ప్రస్తుతం టాటా కంపెనీలోనే CSOగా చేస్తున్న సంగతి తెలిసిందే.
గోవా, బెంగళూరులకు నేటి నుంచే
దేశీయ విమానయాన రంగంలోకి కొత్తగా ప్రవేశించిన ఆకాశ ఎయిర్.. ఇవాళ.. హైదరాబాద్ నుంచి బెంగళూరు, గోవాలకు డైలీ సర్వీసులను ప్రారంభిస్తోంది. వచ్చే నెల 15వ తేదీ నుంచి బెంగళూరుకి అదనంగా మరో 2 సర్వీసులను నడపనుంది. ఈ విషయాన్ని సంస్థ కోఫౌండర్ అండ్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ప్రవీణ్ అయ్యర్ వెల్లడించారు. త్వరలో విదేశీ సర్వీసులను ప్రారంభించే ఆలోచన కూడా ఉందని చెప్పారు. ఆకాశ ఎయిర్ అమ్ములపొదిలో ప్రస్తుతం 14 విమానాలు ఉన్నాయని, 15 రోజులకొక విమానం చేరుతోందని తెలిపారు.
టెస్లాలో 3 వేల మంది నియామకం
ఎలాన్ మస్క్ సారథ్యంలోని ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా.. కొత్తగా 3 వేల మంది వర్కర్లను నియమించుకుంటోంది. నెవడ గిగా ఫ్యాక్టరీ విస్తరణలో భాగంగా ఈ రిక్రూట్మెంట్ చేపట్టింది. ఫ్యాక్టరీ విస్తరణ కోసం 3 పాయింట్ 6 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతోంది. టెస్లా సంస్థకు చెందిన విద్యుత్ వాహనాల్లో అమర్చేందుకు కావాల్సిన బ్యాటరీ ప్యాక్’లను ఈ ఫ్యాక్టరీలో తయారు చేస్తారు. ఈ ఫ్యాక్టరీని ప్రపంచంలోనే అతి పెద్ద బిల్డింగులా నిర్మించాలని టెస్లా ప్రణాళికలు రచించింది. ఆ భవన నిర్మాణం ప్రస్తుతానికి దాదాపు 30 శాతం మాత్రమే పూర్తయింది.