NTV Telugu Site icon

Today (22-12-22) Business Headlines: బీసీసీఐతో మరో సంస్థ కటీఫ్‌!. ఇలాంటి మరిన్ని ముఖ్య వార్తలు..

Today (22 12 22) Business Headlines

Today (22 12 22) Business Headlines

Today (22-12-22) Business Headlines:

ఆజాద్‌ ఇంజనీరింగ్‌ స్పెషల్‌ యూనిట్‌: హైదరాబాద్‌కు చెందిన ఆజాద్‌ ఇంజనీరింగ్‌ కంపెనీ.. జపాన్‌ సంస్థ మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్‌ కోసం స్పెషల్‌ యూనిట్‌ని ఏర్పాటుచేస్తోంది. మేడ్చల్‌కి దగ్గరలోని తునికిబొల్లారం ప్రాంతంలో తలపెట్టిన ఈ యూనిట్‌ నిర్మాణానికి నిన్న బుధవారం భూమి పూజ చేశారు. సుమారు 165 కోట్ల రూపాయలు వెచ్చించి అందుబాటులోకి తేనున్న ఈ కేంద్రంలో స్టీమ్‌ లేదా గ్యాస్‌ ఎయిర్‌ ఫాయిల్స్‌ను తయారుచేసి మిత్సుబిషికి సప్లై చేస్తుంది. ఆజాద్‌ ఇంజనీరింగ్‌ సంస్థ ఇప్పటికే ఏరోస్పేస్‌, విద్యుదుత్పత్తి, సహజ వాయువు మరియు చమురు రంగాల్లోని కంపెనీలకు సర్వీసులు అందిస్తున్న సంగతి తెలిసిందే.

పీఎం మోడీతో ఎయిర్‌బస్‌ సీఈఓ భేటీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో యూరోపియన్‌ సంస్థ ఎయిర్‌బస్‌ సీఈఓ గ్విలౌమ్‌ ఫౌరీ నిన్న బుధవారం భేటీ అయ్యారు. తమ కంపెనీ కార్యకలాపాలను ఇండియాలో విస్తరించాలని భావిస్తున్నట్లు చెప్పారు. భారత్‌లో పౌర విమానయాన వృద్ధికి తమ వంతు మద్దతు కొనసాగిస్తామని తెలిపారు. మోడీతో దిగిన ఫొటోను ట్విట్టర్‌లో షేర్‌ చేసిన ఆయన మరిన్ని వివరాలను వెల్లడించలేదు. గ్విలౌమ్‌ ఫౌరీ ప్రస్తావించిన ‘‘ఇండియాలో తమ పారిశ్రామిక ఉనికి’’ అనే వ్యాఖ్యలను బట్టి చూస్తే.. మన దేశం సివిల్ సప్లై చైన్‌లో మరింతగా ఇన్వాల్వ్‌ కానుందనే విషయం ప్రాధాన్యత సంతరించుకుంది.

మెట్రో ఇండియా.. రూ.2,850 కోట్లు..

మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీ ఇండియాను రిలయెన్స్‌ రిటైల్‌ 2 వేల 850 కోట్ల రూపాయలకు అక్వైర్‌ చేసుకోనుంది. ఈ మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించనుంది. మెట్రో ఇండియాలోని వంద శాతం వాటాలను సొంతం చేసుకునేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై రిలయెన్స్‌ రిటైల్‌ సంతకాలు చేసింది. 2003లో మన దేశంలో కార్యకలాపాలను ప్రారంభించిన మెట్రో సంస్థ ఇప్పుడు 21 నగరాల్లో 31 లార్జ్‌ ఫార్మాట్‌ స్టోర్లను నిర్వహిస్తోంది. వాటిలో దాదాపు 3 వేల 500 మంది ఉద్యోగులు ఉన్నారు. మెట్రోలో పెద్ద సంఖ్యలో ఉన్న కిరాణా షాపులు, ఇతర సంస్థాగత వినియోగదారులు, సప్లయర్‌ నెట్‌వర్క్‌ పైన కూడా రిలయెన్స్‌ యాక్సెస్‌ పొందుతుంది.

ఇండియా స్టీల్‌పై.. నిషేధం ఎత్తివేత!.

ఇండియా నుంచి దిగుమతి చేసుకునే స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ ఉత్పత్తులపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని బ్రిటన్‌ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఆ దేశ వర్తక సంఘం ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాదనను ఆమోదించటం వల్ల స్థానిక పరిశ్రమలకు వచ్చే నష్టమేమీ లేదని అభిప్రాయపడింది. ప్రపోజల్‌కి సర్కారు అంగీకారం తెలిపితే మన దేశం నుంచి బ్రిటన్‌కి స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ కడ్డీలు, రాడ్‌ల ఎగుమతి మళ్లీ యథావిధిగా కొనసాగుతుంది. తమ ప్రొడక్టులపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయకపోతే బ్రిటన్‌ నుంచి వచ్చే ఉత్పత్తుల పైన అదనంగా కస్టమ్స్‌ డ్యూటీస్‌ని విధించాల్సి ఉంటుందని ఇండియా ఈ ఏడాది ఆరంభంలో పేర్కొనటం తెలిసిందే.

బీసీసీఐతో మరో సంస్థ కటీఫ్‌!

ఎడ్‌టెక్‌ మేజర్‌ కంపెనీ బైజూస్‌ బాటలోనే ఎంపీఎల్‌ స్పోర్ట్స్‌ కూడా నడవనుంది. బీసీసీఐతో కుదుర్చుకున్న స్పాన్సర్‌షిప్‌ ఒప్పందాల నుంచి వైదొలగనుంది. బైజూస్‌ ఇప్పటికే ఈ నిర్ణయానికొచ్చినట్లు ఇటీవల వార్తలు వెలువడ్డాయి. ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌కి ప్రధాన స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్న ఈ రెండు సంస్థలు ఇలా బీసీసీఐకి గుడ్‌బై చెప్పనుండటం చర్చనీయాంశంగా మారింది. బైజూస్‌ ఈ ఏడాది జూన్‌లో జెర్సీ స్పాన్సర్‌షిప్‌ ఒప్పందాన్ని 2023 నవంబర్‌ వరకు పొడిగిస్తూ బీసీసీఐతో డీల్‌ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ 35 మిలియన్‌ డాలర్లు. అయితే.. కనీసం మార్చి వరకైనా కొనసాగాలంటూ బీసీసీఐ.. బైజూస్‌ని రిక్వెస్ట్‌ చేస్తోంది.

2023లో.. ఈవీ సేల్స్‌ కొత్త రికార్డు..

మన దేశంలో విద్యుత్‌ వాహనాల విక్రయాలు వచ్చే ఏడాది సరికొత్త రికార్డును నెలకొల్పే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. మార్కెట్లోకి కొత్త మోడళ్లు ప్రవేశించనున్న నేపథ్యంలో డిమాండ్‌ పెరగనుందని నిపుణులు భావిస్తున్నారు. 2023లో ఎలక్ట్రిక్‌ ప్యాసింజర్‌ వెహికిల్స్‌ సేల్స్‌ రెట్టింపు కన్నా ఎక్కువ కానున్నాయని, తద్వారా కనీసం లక్ష యూనిట్ల మార్క్‌ను చేరుకోనుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ఈవీల చరిత్రలో ఈ స్థాయి అమ్మకాలు తొలిసారి నమోదుకానున్నాయి.