NTV Telugu Site icon

Tirumala: ముగిసిన శ్రీవెంకటేశ్వర ధార్మిక సదస్సు.. తిరుపతిని కూడా తిరుమల తరహాలో..!

Tirumala

Tirumala

Tirumala: తిరుమలలో శ్రీవెంకటేశ్వర ధార్మిక సదస్సు ముగిసింది. మూడు రోజుల పాటు సాగిన సదస్సులో 62 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు సూచనలు, సలహాలు ఇచ్చారు. మూడు రోజులు పాటు జరిగిన ధార్మిక సదస్సులో అనేక తీర్మానాలు చేశామని టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. హిందు మతాని నమ్మి, ఈ ధర్మాని ఆచరించాలన్న ఇతర మతస్థులకు తిరుమల క్షేత్రంలో ఒక వేదిక ఏర్పాటు చేస్తామన్నారు. ఇతర మతస్థులు హిందూ మతంలోకి మారేందుకు స్వచ్చందంగా ముందుకు వస్తే, తిరుమలలో మతమార్పిడి చేయించి వారికి శ్రీవారి దర్శనభాగ్యం కల్పిస్తామన్నారు. ప్రవచన కర్తలకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తామని ఆయన చెప్పారు. తిరుపతిని కూడా తిరుమల తరహాలో ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.

Read Also: AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు షురూ.. ఉభయసభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగం

మతాంతీకరణలు అడ్డుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని టీటీడీ ఛైర్మన్‌ కరుణాకర్‌ రెడ్డి తెలిపారు. శిథిలావస్థలో వున్న ఆలయాలు పునరుద్ధరణ చెయ్యడంతో పాటు బడుగు బలహీన వర్గాలు నివసించే ప్రాంతంలో నూతన ఆలయాలు నిర్మిస్తామన్నారు. గో సంరక్షణ చేయాలని ఈ సదస్సులో నిర్ణయం తీసుకున్నారు. యువకులలో ధార్మిక భావాన్ని పెంచేందుకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు. తిరుమలలో వున్న 108 తీర్థాలను భక్తులు సందర్శించేలా ఏర్పాట్లు చేశామన్నారు. ద్రవిడ వేదానికి ప్రాచూర్యం కల్పించేలా ఏర్పాట్లు చేశామని.. పాఠశాల విద్యార్థులకు హైందవ ధర్మం పట్ల అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సోషల్ మీడియా ద్వారా హిందూ ధార్మిక కార్యక్రమాలను ప్రచారం చేసేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. ధార్మిక సంస్థలను ఏకీకృతం చెయ్యడం, టీటీడీ ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించడం, గ్రామ స్థాయిలో సదస్సుని నిర్వహించడంతో పాటు ఏడాదికి ఒక్కసారి ధార్మిక సదస్సును నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.