Prakash Raj: గెలిచేముందు ఒక అవతారం.. గెలిచిన తర్వాత ఇంకో అవతారం! ప్రకాశ్‌ రాజ్ ట్వీట్ వైరల్

  • తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వివాదం
  • ప్రకాశ్‌ రాజ్-పవన్‌ కల్యాణ్‌ మధ్య మాటల యుద్ధం
  • ఏందుకు మనకీ అయోమయం అంటూ మరో ట్వీట్
Pawan Kalyan Vs Prakash Raj

Pawan Kalyan Vs Prakash Raj

Prakash Raj vs Pawan Kalyan: ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్‌ రాజ్ ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా చేస్తున్న పోస్టులు నెట్టింట వైరల్‌గా మారాయి. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ను కోట్‌ చేస్తూ మొదలైన ఆయన పోస్టుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే మూడు ట్వీట్స్ చేసిన ప్రకాశ్‌ రాజ్.. తాజాగా మరో పోస్ట్‌ చేశారు. ‘గెలిచేముందు ఒక అవతారం.. గెలిచిన తర్వాత ఇంకో అవతారం. ఏంటీ అవాంతరం.. ఏందుకు మనకీ అయోమయం.. ఏది నిజం?. జస్ట్‌ ఆస్కింగ్‌?..’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వివాదంపై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, భక్తులు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 20న పవన్‌ కల్యాణ్‌ను కోట్‌ చేస్తూ ప్రకాశ్‌ రాజ్‌ ఓ పోస్ట్‌ పెట్టారు. ‘ప్రియమైన పవన్ కళ్యాణ్ గారు.. మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది. దయచేసి దర్యాప్తు చేయండి.. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోండి. అనవసర భయాలు కల్పించి.. దీన్ని జాతీయ స్థాయిలో చర్చించుకునేలా మీరెందుకు చేస్తున్నారు. మన దేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఉద్రిక్తలు చాలు. జస్ట్‌ ఆస్కింగ్‌’ అని పేర్కొన్నారు.

Also Read: Devara Jatharaa: టైగర్ వేటకు సమయం ఆసన్నమైంది.. మరికొన్ని గంటల్లో ఎరుపెక్కనున్న థియేటర్లు!

ప్రకాశ్‌ రాజ్‌ ట్వీట్‌పై పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో ఆలయ మెట్లను శుభ్రం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రకాశ్‌ రాజ్‌తో పాటు అందరికీ చెబుతున్నా.. విమర్శలకు ముందు ఏం జరిగిందో ముందు తెలుసుకోండి. సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు’ అని అన్నారు. దీనిపై ప్రకాశ్‌ రాజ్‌ ఓ వీడియో రిలీజ్ చేశారు. ‘పవన్ కళ్యాణ్ గారు.. నేను మీ ప్రెస్ మీట్ చూశాను. నేను చెప్పిందాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను విదేశాల్లో షూటింగ్‌లో ఉన్నా. ఈ నెల 30 తర్వాత భారత్ వచ్చి మీ ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతా. ఈలోగా మీకు వీలుంటే.. నా ట్వీట్‌ను మళ్లీ చదవి అర్థం చేసుకోండి’ అని అన్నారు. అనంతరం హీరో కార్తీ సారీ చెప్పిన దానికి స్పందిస్తూ.. ‘చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! జస్ట్ ఆస్కింగ్’ అని మరో ట్వీట్ చేశారు. తాజాగా మరో ట్వీట్ చేశారు.