Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ శాసనసభ ఉపఎన్నికల పోలింగ్‌కు ఎన్నికల యంత్రాంగం, పోలీసు శాఖ పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్ వివరాలను వెల్లడించారు. ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 4,01,365 మంది ఓటర్లు పాల్గొననున్నారు. సోమవారం రాత్రి ఈవీఎంలను కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి పోలింగ్ స్టేషన్లకు తరలించనున్నారు.
ఇక ఎన్నిక సంబంధించి ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపిన వివరాల ప్రకారం.. మొత్తం 139 పోలింగ్ లొకేషన్లలో 407 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. ఈసారి ఒక్కో పోలింగ్ స్టేషన్లో 4 బ్యాలెట్ యూనిట్లు ఉంటాయి. ఈ ఎన్నిక కోసం 2,060 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో ఉండనున్నారు. 58 మంది అభ్యర్థులు, నోటా కలుపుకొని బ్యాలెట్ యూనిట్లో ఉంటాయి. ఇందుకోసం 561 కంట్రోల్ యూనిట్లు, 595 వీవీ ప్యాట్స్, మరియు 2,394 బ్యాలెట్ యూనిట్లు అందుబాటులో ఉంచారు. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత అమలులో ఉంటుంది. నియోజకవర్గంలో 45 FST (ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్), 45 SST (స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్) నిరంతరం పని చేస్తున్నాయి. ఓటర్ల క్యూ మెయింటెన్ చేయడానికి ఎన్సీసీ వాలంటీర్లు సేవలు అందించనున్నారు. అంతేకాకుండా అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద హెల్ప్ డెస్క్‌లు, మొబైల్ డిపాజిట్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని పోలింగ్ స్టేషన్ల నుంచి వెబ్ కాస్టింగ్ లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది.
Hero Xtreme 125R: బడ్జెట్ ధరలో.. హీరో ఎక్స్ట్రీమ్ 125R డ్యూయల్-ఛానల్ ABS విడుదల..
మరోవైపు జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్ భద్రతా వివరాలను వెల్లడించారు. నియోజకవర్గంలో మొత్తం 65 లొకేషన్లలో 226 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని గుర్తించామని, ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల వద్ద పారామిలిటరీ బలగాలు బందోబస్తులో ఉంటాయని, ఇతర స్టేషన్ల వద్ద కూడా పోలీసుల బందోబస్తు పటిష్టంగా ఉంటుందని తెలిపారు. బందోబస్తు కోసం 1,761 లోకల్ పోలీసులు, 8 కంపెనీల సీఐఎస్ఎఫ్ బలగాలు విధుల్లో ఉంటాయన్నారు. ముఖ్యంగా క్రిటికల్ పోలింగ్ స్టేషన్లతో సహా మొత్తం 139 పోలింగ్ స్టేషన్ల వద్ద 139 డ్రోన్లతో నిరంతరం మానిటరింగ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఎలాంటి శాంతిభద్రతలకు సంబంధించిన ఘటనలు జరగలేదని, 27 ఎన్నికల ఉల్లంఘన కేసులు నమోదయ్యాయని, 230 రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేశామని జాయింట్ సీపీ తెలిపారు. ఇప్పటివరకు 3 కోట్ల 60 లక్షల నగదు పట్టుకున్నట్లు వెల్లడించారు.
ఎన్నికల నిబంధనల ప్రకారం వైన్ షాప్స్ నవంబర్ 11 సాయంత్రం వరకు మూసి ఉంటాయి. సైలెన్స్ పీరియడ్‌లో అభ్యర్థులు డోర్ టు డోర్ ప్రచారం చేయవచ్చు. అయితే నలుగురు మాత్రమే ప్రచారంలో పాల్గొనాలని నిబంధన విధించారు. వాట్సప్‌లో బల్క్ మెసేజ్‌లు పంపడం నిషేధం, నియోజకవర్గ ఓటర్లు కాని స్థానికేతరులు వెంటనే వెళ్లిపోవాలని, దీనికోసం హోటల్స్, హాల్స్, ఫంక్షన్ హాళ్లలో తనిఖీలు చేసి ఇతరులను నియోజకవర్గం నుంచి పంపించేస్తామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. ఓటింగ్ శాతం వివరాలను ప్రతీ రెండు గంటలకు ఒకసారి అనౌన్స్ చేస్తామని ఈసీ అధికారులు తెలిపారు. ఓట్ల లెక్కింపు 42 టేబుల్స్ వద్ద 10 రౌండ్లలో జరుగనుంది. అధికారులు ఓటర్లందరినీ ముందుకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.