ఎక్కడ పుట్టాయో తెలీదు.. తల్లి ఎక్కడుందో జాడ లేదు.. నంద్యాల జిల్లాలో నాలుగు పులిపిల్లలు తల్లి కోసం తపిస్తున్నాయి. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మాడాపురం వద్ద లభించిన పులి పిల్లలను ఆత్మకూరుకు తరలించారు. ఆత్మకూరు డి ఎఫ్ ఓ ఆఫీసులో పులి పిల్లలకు షెల్టర్ ఇచ్చారు. అటవీ సిబ్బంది సంరక్షణలో పులి పిల్లలు సేదతీరుతున్నాయి. పెద్ద పులి వద్దకు పులి పిల్లలను చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు అటవీ సిబ్బంది. పెద్ద పులి జాడ తెలుసుకునేందుకు పెద్ద గుమ్మడాపురం లో 40 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు అధికారులు. అయితే పులి జాడ ఇంకా కనుక్కోలేదు.
Read Also: Citadel: ట్రైలర్ అదిరిపోయింది… స్పై యాక్షన్ అంటే ఆ మాత్రం ఉండాలి…
తల్లికి దూరంగా ఉన్న పులిపిల్లలకు ఆహారం అందిస్తున్నారు అటవీ సిబ్బంది. పెద్ద పులి జాడ దొరకని పక్షంలో 4 పిల్లలను తిరుపతి జూకు తరలించే యోచనలో అటవీ అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. నేడు ఆత్మకూరు కు తిరుపతి వన్య ప్రాణి సంరక్షణ ప్రత్యేక బృందం రానుంది. ఈ పులికూనల వయసు 40 రోజులు ఉంటుందని భావిస్తున్నారు. సోమవారం నంద్యాల జిల్లాలో ముద్దొచ్చే పులిపిల్లలు హాట్ టాపిక్ అయ్యాయి. ఆత్మకూరు అటవీ డివిజన్ కొత్తపల్లి మండలం లో పెద్ద పులి పిల్లలు సందడి చేశాయి. ఎక్కడినుంచి వచ్చాయో తెలీదు. పెద్ద గుమ్మడాపురం గ్రామంలో నాలుగు పెద్ద పులి పిల్లలను గుర్తించారు గ్రామస్థులు. ఆ పులిపిల్లలపై కుక్కలు దాడి చేసి గాయ పరచకుండా.. గదిలో భద్రపరిచి..అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు గ్రామస్థులు.
అమ్మా ఎక్కడున్నావ్… వచ్చెయ్యమ్మా..
ఇదిలా ఉంటే. నంద్యాల ప్రాంతంలో ఎండ తీవ్రత పెరుగుతుండటంతో చల్లని ప్రదేశంలో ఉంచేందుకు ఆత్మకూరు మండలంలోని బైర్లూటి పశు వైద్యశాలకు పులి పిల్లల్ని తరలించారు. పులి పిల్లలకు పాలు, ఓఆర్‌ఎస్ నీళ్లు పట్టిస్తున్నారు. అవి ఆరోగ్యంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. తల్లిపులి తన పిల్లలతో కలిసి ఆదివారం రాత్రి ఈ ప్రదేశానికి వచ్చి ఉంటుందన్నారు. కుక్కల అరుపులు, జనాల శబ్దాలు విని భయపడి తల్లి, పిల్లలు వేరై ఉంటాయని భావిస్తున్నట్లు తెలిపారు. పులి పిల్లలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. సెల్ఫీలు కూడా దిగారు. ఈ పులి కూనలను వదిలి తల్లిపులి ఉండలేదని, దానికి ఏదైనా అపాయం జరిగిందేమో అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఏ క్షణంలోనైనా తల్లి పులి వస్తుందేమోనని భయంతో ఉన్నారు స్థానికులు.
Read Also:Warehouse explosion: ముసాపేట గోదాం పేలుడు ఘటనపై యజమాని క్లారిటీ.. మృతుడు నా వద్ద..