NTV Telugu Site icon

Tamil Nadu: దారుణం.. 13 ఏళ్ల బాలికపై ముగ్గురు ఉపాధ్యాయుల అత్యాచారం

Tamil Nadu

Tamil Nadu

Tamil Nadu: తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలోని బార్గూర్ సమీపంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికను అదే పాఠశాలలో పనిచేస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులు సామూహికంగా అత్యాచారం చేసి గర్భవతిని చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ముగ్గురు ఉపాధ్యాయులను అరెస్టు చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాలిక పాఠశాలకు రాకపోవడంతో అనుమానం వచ్చిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాలిక ఇంటికి వెళ్లి తల్లిని నిలదీశాడు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక గర్భవతి అని పాఠశాలలో పనిచేసే ఇద్దరు గ్రాడ్యుయేట్ టీచర్లు, ఒక ఇంటర్మీడియట్ టీచర్ తన కుమార్తెను సామూహికంగా అత్యాచారం చేశారని తల్లి కన్నీరుమున్నీరైంది.

Also Read: Indore: నలుగురు యువకుల అరాచకం.. ఎస్సైపై దాడి (వీడియో వైరల్)

వెంటనే బాలిక తల్లిని జిల్లా శిశు సంరక్షణ అధికారికి ఫిర్యాదు చేయమని ప్రధానోపాధ్యాయుడు సూచించాడు. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు బాలికను ఆసుపత్రిలో చేర్పించి పరీక్షలు నిర్వహించారు. ఈ ఘటనపై జిల్లా శిశు సంరక్షణ అధికారి బార్గూర్ ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనితో పోలీసులు విచారణ చేపట్టారు. పాఠశాలలో పనిచేస్తున్న బార్గూర్‌కు చెందిన చిన్నసామి (57), మత్తూరుకు చెందిన ఆరుముగం (45), వేలంపాటికి చెందిన ప్రకాష్ (37) అనే ముగ్గురు ఉపాధ్యాయులు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. దీని కారణంగా బాలిక గర్భవతి అయినట్లు తేలింది. దీంతో పోలీసులు ముగ్గురు ఉపాధ్యాయులను అరెస్టు చేశారు. ఈ ఘటనతో జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేగింది. ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని బాలిక బంధువులు పాఠశాలను ముట్టడించి ధర్నాకు దిగారు. ఈ ఘటనపై ఉన్నత అధికారులు సీరియస్‌గా స్పందించారు. ముగ్గురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు.