NTV Telugu Site icon

TMC Party: ముగ్గురు బీజేపీ ఎంపీలు మాతో టచ్లో ఉన్నారు..

Tmc

Tmc

2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కేవలం 240 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ప్రస్తుతం టీడీపీ, జేడీయూ లాంటి మిత్ర పక్షాలతో కలిసి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీలు పార్టీ మారితే కష్టమే. ఈ అంశంపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సాకేత్ గోఖలే సంచలన వ్యాఖ్యలు చేశారు. ముగ్గురు బీజేపీ ఎంపీలు మాతో టచ్‌లో ఉన్నారు.. త్వరలో లోక్‌సభలో బీజేపీ బలం 237కి తగ్గుతుందని ఆయన తెలిపారు. అలాగే, భారత కూటమి ఎంపీల సంఖ్య 240కి పెరుగుతుందన్నారు. నరేంద్రమోడీ పొత్తు నిలకడగా లేదన్నారు. ఇది ఎంతో కాలం కొనసాగదని ఎంపీ సాకేత్ గోఖలే తెలిపారు.

Read Also: Chandrababu Naidu Oath Ceremony Live Updates: ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. లైవ్ అప్‌డేట్స్

అయితే, టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ బీజేపీ స్పందిస్తూ.. అలాంటి వాదనలు నిరాధారమని పేర్కొంది. పార్టీ రాష్ట్ర శాఖ ఐక్యంగా ఉందని వెల్లడించింది. తృణమూల్‌ కాంగ్రెస్ పార్టీతో బెంగాల్‌కు చెందిన బీజేపీ ఎంపీలు ఎవరూ టచ్‌లో లేరని తెలిపారు. టీఎంసీ పగటి కలలు కంటోంది.. 2014 నుంచి కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యమైన శక్తిగా ఎదగాలని మమతా బెనర్జీ కలలు కంటోంది అని బెంగాల్ బీజేపీ విమర్శలు గుప్పించింది. ఇక, లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని 42 స్థానాలకు గాను తృణమూల్ కాంగ్రెస్ 29 స్థానాల్లో గెలిచింది. ఇక, బీజేపీ సీట్ల సంఖ్య 2019లో 18 నుంచి 2024లో 12కి తగ్గింది. అలాగే, తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ తన మెజారిటీ మార్క్‌ను కోల్పోయింది.. అయితే ఎన్డీయే కూటమికి 293 సీట్లు రావడంతో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాగా, కాంగ్రెస్ 99 సీట్లు గెలుచుకోగా, ‘భారత్’ కూటమి 234 సీట్లలో విజయం సాధించింది. ఎన్నికల తర్వాత గెలిచిన ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కూడా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించడంతో ప్రతిపక్ష కూటమి బలం 236కి చేరుకుంది.