Site icon NTV Telugu

Kidnap: చిన్నారులను కిడ్నాప్‌ చేసి విక్రయించేందుకు ప్రయత్నించిన ముగ్గురు అరెస్ట్

Kidnap

Kidnap

Kidnap: చిన్నారులను కిడ్నాప్ చేసి విక్రయించేందుకు ప్రయత్నించిన ముగ్గురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. ఈ దారుణమైన సంఘటన సైబరాబాద్ కమిషనరేట్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కేసు వివరాలను శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి వెల్లడించారు. కర్నూలు ప్రాంతానికి చెందిన చిన్న, లక్ష్మి అనే దంపతులు చిన్న చిన్న పనులు చేస్తూ శంషాబాద్ పట్టణంలోని ఫ్లై ఓవర్ కింద నిద్రిస్తూ జీవనం సాగిస్తున్నారు. అదే క్రమంలో ఈ నెల 27వ తేదీన తన ఇద్దరు కూతుళ్లతో కలిసి నిద్రపోతున్న సమయంలో.. ముగ్గురు దండు హనుమంతు, దండు చందన, భంగపతి స్వాతిలు కలిసి చిన్న, లక్ష్మితో నిద్రిస్తున్న ఒక నెల కూతురును తీసుకుని పరారయ్యారు. అయితే ఉదయం లేచి చూసేసరికి చిన్నారి కనిపించలేదు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికిన ఆచూకీ లభించలేదు. దీంతో ఆర్జీఐఏ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

Read Also: TGSRTC: 8వ తరగతి పాస్ అయ్యారా.. అద్భుత అవకాశం కల్పిస్తున్న టీజిఎస్ఆర్టిసి..

ఫిర్యాదు అందుకున్న పోలీసులు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు ఆధారంగా నిందితులను గుర్తించారు. నిందితులు దండు హనుమంతు, దండు చందన, భంగపతి స్వాతిలను సిద్ధాంతి వద్ద గుర్తించి వారి వద్ద ఉన్న చిన్నారిని క్షేమంగా పట్టుకున్నారు. నిందితులు రాజేంద్రనగర్ మైలార్ దేవ్ పల్లికి చెందిన వారుగా గుర్తించారు. అయితే ఆర్థిక ఇబ్బందులతో మద్యం సేవించి చిన్నారులను కిడ్నాప్ చేసి విక్రయించి సొమ్ము చేసుకుని విలాసాలకు పాల్పడుతున్నట్లు డీసీపీ నారాయణరెడ్డి పేర్కొన్నారు. చిన్నారిని తల్లిదండ్రుల చెంతకు క్షేమంగా చేర్చిన అధికారులను డీసీపీ నారాయణరెడ్డి ప్రశంసించారు. చిన్నారులను బయటకు వదలవద్దని, ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని డీసీపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Exit mobile version