Telugu movies: ఈ యేడాది జనవరి మాసంలో డబ్బింగ్ తో కలిపి పదిహేను సినిమాలు విడుదల కాగా… ఫిబ్రవరి ఫస్ట్ వీకెండ్ లో ఏకంగా ఎనిమిది చిత్రాలు జనం ముందుకు వస్తుండటం విశేషం. ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ చిత్రసీమల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సందీప్ కిషన్ నటించిన తొలి పాన్ ఇండియా సినిమా ‘మైఖేల్’ ఫిబ్రవరి 3న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. రంజిత్ కోడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వరుణ్ సందేశ్ కూడా కీలక పాత్రను పోషించాడు. కమెడియన్ సుహాస్ హీరోగా నటించిన ‘రైటర్ పద్మభూషణ్’ చిత్రం కూడా అదే రోజు విడుదల అవుతోంది. ఫణ్ముఖ్ ప్రశాంత్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ సినిమా విజయంపై దర్శక నిర్మాతలకు మంచి నమ్మకం ఉంది. అందుకే ఈ మూవీ ప్రివ్యూను కొన్ని నగరాలు, పట్టణాలలో వేశారు. ఇక జైదీప్ విష్ణు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం’ సినిమా కూడా 3వ తేదీ వస్తోంది. కొంతమంది ఔత్సాహికులు కలిసి ఈ సినిమాను నిర్మించారు. దాదాపు నలభై మంది కొత్త నటీనటులు ఇందులో నటించారు. మణిశర్మ అందించిన సంగీతం ఈ చిత్రానికి మెయిన్ హైలైట్ అని చెబుతున్నారు.
ఈ మూడు సినిమాలతో పాటు ‘సువర్ణ సుందరి’, ‘ప్రేమదేశం’, ‘మాయగాడు’ చిత్రాలూ రిలీజ్ అవుతున్నాయి. సీనియర్ నటి జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రలు పోషించిన ‘సువర్ణ సుందరి’ చిత్రాన్ని సురేంద్ర మాదారపు దర్శకత్వంలో ఎమ్. ఎల్. లక్ష్మీ నిర్మించారు. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమాను ఇప్పుడు వీరబాబు విడుదల చేస్తున్నారు. అలానే మధుబాల, త్రిగున్, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రలను పోషించిన ప్రేమకథా చిత్రం ‘ప్రేమదేశం’. దీని విడుదల కూడా అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. శ్రీకాంత్ సిద్ధమ్ దర్శకత్వంలో శిరీష సిద్దమ్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 3న వస్తోంది. దీనికి మణిశర్మ స్వరరచన చేశారు. అలానే పైరసీ నేపథ్యంలో ‘అడ్డా’ ఫేమ్ జి.ఎస్. కార్తీక్ రెడ్డి తెరకెక్కించిన ‘మాయగాడు’లో నవీన్ చంద్ర, గాయత్రి సురేశ్ జంటగా నటించారు. ఈ సినిమా కూడా శుక్రవారం విడుదల అవుతోంది. ఆంగ్ల అనువాద చిత్రం ‘ఇండిపెండెంట్ సాస్టర్’ కూడా అదే రోజు వస్తోంది.
ఇదిలా ఉంటే…. ఫిబ్రవరి 4న సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించిన ‘బుట్టబొమ్మ’ చిత్రం జనం ముందుకొస్తోంది. అనికా సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంతో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మలయాళ చిత్రం ‘కప్పెల’కు ఇది రీమేక్. గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు. మరి ఈ ఎనిమిది చిత్రాలలో ఏ యే సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తాయో చూడాలి.