ఫిబ్రవరి నెల నుంచే సూర్య ప్రతాపం మొదలైంది. మార్చి నెల సగమైనా గడవక ముందే వాతావరణం మండువేసవిని తలపిస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే ఇక ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని సామాన్యుడు బెంబేలెత్తుతున్నాడు! గత ఏడాదితో పోల్చితే ఫిబ్రవరి నుంచే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం మొదలైంది. మార్చి నెలలో సాధారణం కంటే రోజువారీ ఉష్ణోగ్రతలు నాలుగైదు డిగ్రీలు ఎక్కువగానే నమోదవుతున్నాయి.
ఈ ఏడాది మార్చిలోనే ఉష్ణోగ్రతలు పెరిగాయి. భానుడి భగభగలతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. ఏప్రిల్ రాకముందే ఎండల తీవ్రత రోజురోజుకూ అధికమవుతోంది. ఉదయం, సాయంత్రం వేళలలో కాస్త చల్లబడినా గత కొద్ది రోజులుగా మధ్యాహ్నం ముఖం మాడిపోయేలా ఎండలు ఉంటున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. రికార్ట్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చిలోనే గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి.
Read Also: Kamal Haasan: దేశాన్ని విభజించేందుకే సీఏఏని తెచ్చింది.. కమల్ హాసన్ ఫైర్..
ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో 40.5గా నమోదు అవుతున్నాయి. ఆదిలాబాద్ అర్బన్ లో 40.3 గా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పటివరకు.. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఇక్కడే నమోదయ్యాయి. అటు.. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కొండాపూర్ లో 40.1గా నమోదు అయ్యాయి. మరోవైపు.. ఉమ్మడి మెదక్ జిల్లాలో భానుడి భగభగమంటున్నాడు. ఉక్కపోత, ఎండతో జనం అల్లాడుతున్నారు. సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. అటు.. సంగారెడ్డి జిల్లాలో 39.6 డిగ్రీలు, మెదక్ జిల్లాలో 38.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అయింది.