K RAMP చిత్ర నిర్మాత రాజేష్ దండ కు ఓ వెబ్ సైట్ కు మధ్య నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. తాజాగా సదరు వెబ్ సైట్ నిర్వాహకులపై తెలుగు సినిమా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కు లేఖ రాశారు. ఈ లేఖలో ‘ నేను ‘కే ర్యాంప్’ అనే సినిమాను నిర్మించి ఈ నెల 18వ తేదీన విడుదల చేశాను. దీనికి మంచి ప్రేక్షక ఆదరణ లభించింది. మంచి కలెక్షన్స్ తో సినిమా అన్ని ప్రాంతాల్లో దూసుకువెళ్తంది. ఈ నేపథ్యంలో కొన్ని వెబ్సైట్స్- నాపైన, నా సినిమాపైన నెగిటీవ్ క్యాంపెన్ను ప్రారంభించింది. సినిమా కలెక్షన్స్న ప్రభావితం చేసేలా.. ఇండస్ట్రీలో నాకు ఉన్న మంచి పేరు పోయేలా రకరకాల ట్వీట్స్ తో ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించింది. దీని వల్ల ఓవర్సీస్లో కే ర్యాంప్’ కలెక్షన్లు దెబ్బతిన్నాయి.
Also Read : OG OTT : ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన OG.. ఎక్కడంటే
నా సినిమాను దెబ్బతీసే ఉద్దేశంతో విడుదలయిన వెంటనే తక్కువ రేటింగ్ తో నెగిటీవ్ రివ్యూ ఇచ్చింది. రివ్యూలు, రేటింగ్లు అనేది వెబ్సైట్లో ఉండే వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి దానిపై నేను ఏ విధంగాను స్పందించలేదు. ఆ మర్నాడు నుంచి ఈ వెబ్సైట్ సినిమాను టార్గెట్ చేసి ట్వీట్లు చేయటం మొదలు పెట్టింది. దీని వల్ల డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్లో ఒక విధమైన గందరగోళం నెలకొంది. సినిమా విజయవంతమయిన ఆనందంలో మేము విజయోత్సవం జరుపుకుంటున్న సమయంలో మరొక ట్వీట్ నా దృష్టికి వచ్చింది. దీనితో నేను నా సహనాన్ని కోల్పోయి ఆ విజయోత్సవ వేడుకలో వెబ్సైట్ దాని నిర్వాహకులను దూషించాను. ఆ విధంగా దూషిం చటం తప్పే, కానీ నన్ను ఆ వెబ్సైట్ అలాంటి పరిస్థితుల్లోకి నెట్టేసింది. నేను మొత్తం మీడియాను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదు. సొమ్ము ఇస్తేనే మంచి రేటింగ్ ఇస్తాం లేకపోతే సినిమానే దెబ్బతీస్తాం అనే ధోరణి మొత్తం ఇండస్ట్రీకే మంచిది కాదు, చిన్న నిర్మాతల పాలిట శాపంగా మారిన ఈ పద్ధతికి వెంటనే స్వస్తి పలకాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
విన్నపం :
నాకు ప్రస్తుతం ఎదురవుతున్న పరిస్థితులు అందరి నిర్మాతలకు ఎదురవుతున్నాయి. దాదాపు అందరు నిర్మాతలు సినిమాలు విడుదలయ్యే సమయంలో ఎదో ఒక రకమైన బ్లాక్మెయిలు గురవుతున్నారు. గతంలో శ్రీ నాగవంశీ ఈ తరహా పరిస్థితులే ఎదుర్కొన్నారు. ఆయన బయటకు వచ్చి తన ఆవేదనను వ్యక్తీకరించారు. కానీ అనేక మంది చిన్న నిర్మాతలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. అందువల్ల వెబ్సైట్లను నియంత్రించేదుకు తగిన చర్యలు తీసుకోవాలని ఛాంబర్ను, కౌన్సిల్ను, గిల్డ్ను కోరుతున్నాను. నా సినిమాపై అనుచిత ట్వీట్లు పెట్టిన ఆ వెబ్సైట్ నిర్వాహకులను.. ఎడిటోరియల్ సిబ్బందిని ఛాంబర్కు పిలిపించి.. నా బిజినెస్ ను, వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసినందుకు క్షమాపణలు చెప్పించమని కోరుతున్నాను. ఒక వేళ వారు క్షమాపణలు చెప్పటానికి నిరాకరించిన పక్షంలో వారికి ఎటువంటి ప్రకటనలు ఇవ్వకుండా చర్యలు తీసుకొమ్మని ఛాంబర్ ను, గిల్డ్ ను అభ్యర్థిస్తున్నాను. నేను వారిపై వ్యక్తిగతంగా క్రిమినల్ అండ్ సివిల్ చర్యలు తీసుకోవటానికి సం సిద్ధమవుతున్నాను. ఇది ప్రస్తుతం నా ఒక్కడి సమస్యే కావచ్చు. కానీ ఈ సమస్యను గతంలో అనేక మంది నిర్మాతలు ఎదుర్కొన్నారు. భవిష్యత్తులో ఎదుర్కొంటారు. వెబ్సైట్లు.. యూట్యూబ్ ఛానల్స్ చేసే బ్లాక్మెయిలింగ్ ఎక్కడో ఒక చోట పుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇది పరిశ్రమ అస్థిత్వాన్నే దెబ్బతీస్తుంది.
నా విజ్ఞప్తిని ఛాంబర్, గిల్డ్, కౌన్సిల్లు పరిశీలించి.. తగిన చర్యలు తీసుకుంటాయని కోరుకుంటున్నాను. మీకు అవసరమైన అదనపు సమాచారాన్ని ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అని లెటర్ రిలీజ్ చేసారు నిర్మాత రాజేష్ దండ