‘ఆపరేషన్ సిందూర్’తో నిరాశ చెందిన పాకిస్థాన్.. భారతదేశంలోని సైనిక స్థావరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. కానీ భారత సైన్యం ఈ దాడిని తిప్పికొట్టింది. ఈ అంశంపై వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషి సమాచారం ఇచ్చారు. గత 24 గంటల్లో పాకిస్థాన్ సైన్యం భారతదేశాన్ని ఎలా లక్ష్యంగా చేసుకుందో వివరించారు. వారి ఎత్తుగడలు ఏవీ విజయవంతం కాలేదని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ లక్ష్యం ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడం.. మేము ఏ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదు అని వెల్లడించారు. పాకిస్థాన్ మాత్ర భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుందన్నారు. ఇలాంటి పని చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తాము ఇప్పటికే హెచ్చరించామని స్పష్టం చేశారు. అమాయక ప్రజలను చంపినందుకు పాకిస్థాన్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
READ MORE: RAPO 22: రామ్ సినిమా టైటిల్ ఆరోజే చెప్తారట!
కల్నల్ సోఫియా ఖురేషి మాట్లాడుతూ.. “2025 మే 7/8 రాత్రి, పాకిస్థాన్ డ్రోన్లు, క్షిపణులతో అనేక భారత సైనిక స్థావరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. వారి ప్రతి దాడిని సైనికులు భగ్నం చేశారు. పాకిస్థాన్ దాడికి రుజువు ఆ దేశానికి చెందిన ఆయుధ శిథిలాలు. ఇవి చాలా చోట్ల దొరికాయి. దీనికి ప్రతిగా భారత సైన్యం ఈ ఉదయం పాకిస్థాన్‌లోని అనేక ప్రదేశాలపై దాడి చేసి వారి వైమానిక రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసింది. లాహోర్‌లో వైమానిక రక్షణ వ్యవస్థ ధ్వంసమైంది.” అని సోఫియా ఖురేషి వెల్లడించారు. జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా, బారాముల్లా, ఉరి, పూంచ్, మెంధార్ రాజౌరి సెక్టార్లలో పాకిస్థాన్ అకస్మాత్తుగా మోర్టార్లు, భారీ ఫిరంగి కాల్పులకు పాల్పడిందని వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ తెలిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు మహిళలు, ఐదుగురు పిల్లలు సహా 16 మంది అమాయక పౌరులు మరణించారని వెల్లడించారు. ఈ దుర్మార్గపు చర్యకు అనంతరం భారత సైన్యం వెంటనే స్పందించిందని.. పాకిస్థాన్ పోస్టులపై లక్ష్యంగా కాల్పులు జరిపిందని వెల్లడించారు.