జంతువుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు ఇండియన్ మహిళలను థాయ్ లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాంకాక్ సువర్ణభూమి అంతర్జాతీయ విమానశ్రయంలో వీరిద్దరి లగేజ్ చెక్ చేయగా..రెండు సూట్‌కేసుల్లో 109 సజీవ ప్రాణులను పట్టుకున్నారు. థాయ్ లాండ్ అధికారులు ఎక్స్ రే స్కానర్ల ద్వాారా చెక్ చేస్తున్న సమయంలో ఈ విషయం బయటపడింది. రెండు రెండు సూట్‌కేసుల్లో రెండు తెల్ల పందికొక్కులు, రెండు అర్మడిల్లలు, 35 తాబేళ్లు, 50 బల్లలు, 20 పాములను పట్టుకున్నారు. థాయ్ లాండ్ నుంచి ఇండియా చెన్నైకి వస్తున్న క్రమంలో నిత్య రాజా, జకియా సుల్తానా ఇబ్రహిం అనే ఇద్దరు మహిళలు పట్టుబడ్డారు. వీరిద్దరిని థాయ్ లాండ్ వన్యప్రాణుల చట్టం, కస్టమ్స్ చట్టాల ప్రకారం అరెస్ట్ చేశారు.
థాయ్ లాండ్ లో జంతు ప్రాణుల అక్రమ రవాణా పెద్ద సమస్యగా మారింది. చాలా కాలంగా అక్కడ నుంచి ఇతర దేశాలకు వన్యప్రాణులను స్మగ్లింగ్ చేస్తున్నారు. 2019లో బ్యాంకాక్ నుంచి చెన్నై వచ్చిన ఓ వ్యక్తి లగేజీని పరిశీలిస్తే ఏకంగా ఒక నెల వయసున్న చిరుతపులి పిల్లను కనుక్కున్నారు. ఇటీవల ఓ నెల క్రితం చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో థాయ్ లాండ్ నుంచి వన్య ప్రాణుల స్మగ్లింగ్ చేసే ప్రయత్నాలను అడ్డుకున్నారు. బ్యాంకాక్ నుంచి ఇక్కడి వచ్చిన ఒక ప్రయాణికుడి నుంచి అల్బినో పోర్కుపైన్, కోతిని స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణుల పర్యవేక్షణ ఏజెన్సీ టీఆర్ఏఎఫ్ఎఫ్ఐసీ 2022 నివేదిక ప్రకారం 2011 నుంచి 2020 మధ్య 18 ఇండియన్ ఎయిర్ పోర్టుల్లో 70 వేలకు పైగా మన దేశానికి, విదేశాలకు సంబంధించిన అటవీ జంతువులను కనుక్కున్నారు.