TG EAPCET 2025: తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈఎపిసెట్ (TG EAPCET) 2025 పరీక్షలు ఈ నెల ఏప్రిల్ 29 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు మే 4 వరకు కొనసాగనున్నాయి. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగాలకు సంబంధించిన ప్రవేశ పరీక్షలు ఏప్రిల్ 29, 30 తేదీల్లో నిర్వహించనుండగా.. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన పరీక్షలు మే 2 నుంచి 4 వరకు జరగనున్నాయి. ఈఎపిసెట్ పరీక్షలు ప్రతిరోజూ రెండు సెషన్లలో జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహించనున్నారు అధికారులు.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16 ప్రాంతాల్లో, 124 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షలకు ఇంజనీరింగ్ విభాగానికి 2,19,420 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు 86,101 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈ పరీక్షల కోసం హాల్ టికెట్లు విడుదల తేదీలు కూడా అధికారులు ప్రకటించారు. అగ్రికల్చర్, ఫార్మసీ అభ్యర్థులు ఏప్రిల్ 19 నుండి తమ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ అభ్యర్థుల హాల్ టికెట్లు ఏప్రిల్ 22 నుండి అందుబాటులో ఉంటాయి. ఈ సందర్భంగా అధికారులు విద్యార్థులకు సూచనలు చేశారు. “ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రానికి ప్రవేశం కల్పించము” అని వారు స్పష్టం చేశారు. కాబట్టి పరీక్షా కేంద్రానికి ముందుగా చేరుకునేలా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని అభ్యర్థులకు విజ్ఞప్తి చేశారు అధికారులు.