గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం వ్యవహారశైలికి నిరసనగా నిర్వాసిత కార్మికులు పోర్టు ముట్టడికి పిలుపునిచ్చారు. గతంలో వన్ టైం సెటిల్‌మంట్ కింద కార్మికులతో చేసిన ఒప్పందం నెరవేర్చకపోవడమే ఈ ఆందోళనకు కారణమైంది. సెటిల్‌మెంట్ ఒప్పందం ఉల్లంఘనపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. నిర్వాసిత ఉద్యోగులకు వన్ టైం సెటిల్‌మెంట్‌గా రూ.27 లక్షలు చెల్లించేందుకు పోర్టు యాజమాన్యం హామీ ఇచ్చింది. 60 రోజుల్లో మొత్తాన్ని చెల్లిస్తామని ఒప్పందం కుదిరినప్పటికీ, ఇప్పటి వరకు కార్మికులకు కేవలం రూ.4 లక్షలు 80 వేలే చెల్లించినట్లు సమాచారం. తమకు రావాల్సిన మరో రూ.2 లక్షలు 30 వేల చెల్లింపును ఇన్‌కామ్ టాక్స్ పేరుతో నిలిపివేసి కాలయాపన చేయడం కార్మికుల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది.
Read Also: Hyderabad: నగరంలో రియల్టర్ దారుణ హత్య.. నడిరోడ్డుపై కత్తితో నరికి, కాల్చి చంపిన దుండగులు..
పెండింగ్‌లో ఉన్న రూ.2,30,000 వెంటనే విడుదల చేయాలని కార్మికుల ప్రధాన డిమాండ్‌గా ఉంది.. అదే సమయంలో ఆందోళన చేస్తున్న కార్మికులు, కమిటీ సభ్యులపై ఉన్న పోలీస్ కేసులను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు.. ఇక, ఇప్పటికే గంగవరం పోర్టు కాలుష్యంతో ప్రజలు, కార్మికులు ఇబ్బందులు పడుతుండగా, ఇప్పుడు వేతనాలు, సెటిల్‌మెంట్ పేరుతో ఇలా వేధించడం సరైంది కాదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. పోర్టు యాజమాన్యం తక్షణం సమస్యను పరిష్కరించాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్‌లు వెల్లువెత్తుతున్నాయి. గంగవరం పోర్టులో పరిస్థితి ఎటువంటి మలుపు తిరుగుతుందో చూడాలి.