అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా తెనాలి చెందిన నాగశ్రీవందన పరిమళ (26) అనే యువతి మృతి చెందారు. శుక్రవారం రాత్రి పరిమళ ప్రయాణిస్తున్న కారును ట్రక్ ఢీ కొట్టడంతో గాయాలపాలై మృతి చెందారు. మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్) డిగ్రీని అభ్యసించేందుకు రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లారు. టెన్నెసీ రాష్ట్రంలో పరిమళ ఎంఎస్ చదువుతున్నారు.
తెనాలికి చెందిన వ్యాపారి గణేష్, రమాదేవి దంపతుల కుమార్తె నాగశ్రీవందన పరిమళ. ఎంఎస్ చేయడానికి 2022 డిసెంబరులో పరిమళ అమెరికా వెళ్లారు. మరికొద్ది రోజుల్లో ఎంఎస్ పట్టా రానుండగా.. ఇంతలోనే పరిమళ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. పరిమళ మృతితో ఆమె కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పరిమళ భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు పంపించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రతినిధులు ప్రయత్నాలు చేస్తున్నారు.