Temple Collapses: హిమాలయ పట్టణం జోషిమత్‌లోని సింధర్ వార్డ్‌లో శుక్రవారం సాయంత్రం ఒక ఆలయం కూలిపోయింది. పెద్ద విపత్తు సంభవిస్తుందనే భయంతో గుడి సమీపంలో నివసిస్తున్న వారు తీవ్ర ఆందోళన చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, గత 15 రోజులుగా భారీ పగుళ్లు ఏర్పడిన తరువాత ఆలయాన్ని మూసేశారు. ఈ సంఘటన జరిగినప్పుడు లోపల ఎవరూ లేరని తెలిపారు. పలు ఇళ్లలో భారీ పగుళ్లు వచ్చాయని, దాదాపు 50 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు.
Read Also: TAN CARD: PAN, TAN కార్డుల మధ్య తేడా ఏంటో తెలుసా?
ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లా జోషీమఠ్ నగరంలో భూమి కుంగిపోవడం తీవ్ర కలకలం రేపింది. భూమి కుంగిపోవడం వల్ల సుమారు 600 ఇళ్లకు పెద్దపెద్ద పగుళ్లు ఏర్పడ్డాయి. భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మరికొంతమంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఎన్టీపీసీ హైడ్రో పవర్ ప్రాజెక్టు వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా రోజుల నుంచి ఇలా జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రజలు గత అర్ధరాత్రి రోడ్లపైకి వచ్చి కాగడాలతో నిరసన తెలిపారు.
బద్రినాథ్, హమ్‌కుండ్ క్షేత్రాలకు వెళ్లే మార్గంలో ఉన్న ఈ ప్రాంతంలో భూమి కుంగి పోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. భూమి కుంగి.., ఇళ్లకు పగుళ్లు రావడం వల్ల సుమారు 60 కుటుంబాలు జోషీమఠ్‌ను వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లిపోగా.. గురువారం ఉదయం 29 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. సుమారు 500 కుటుంబాలు అక్కడే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నాయని తెలుస్తోంది. ఇల్లు పగుళ్లు ఇచ్చినప్పటికీ తమకు మరో మార్గం లేక ఇక్కడే ఉంటున్నట్లు వారు తెలిపారు. భూమి కుంగిపోవడం వల్ల 3,000 మంది ఇబ్బందులు పడుతున్నట్లు మున్సిపల్ అధికారులు కూడా తెలిపారు.