Temperatures Rise in Telangana State: తెలంగాణ రాష్ట్రంలో ఎండలు అప్పుడే ముదిరిపోయాయి. ఇంకా మార్చి నెల కూడా రాకముందే ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. తెలంగాణలో దాదాపు 4 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 32 నుంచి 37 డిగ్రీల మధ్యన పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలుగా నమోదవుతున్నాయి.
Also Read: Telangana Govt: 112 మంది వైద్యులపై వేటుకు సిద్దమైన తెలంగాణ సర్కార్!
మార్చి నెలలో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలానే వచ్చే రోజుల్లో వడగాలుల ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం రాత్రి వేళలో కాస్త చల్లగానే ఉన్నా.. పగటి పూట మాత్రం పలు ప్రాంతాల ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారు. గతేడాది ఇదే సమయంలో 15-20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కానీ ఈసారి మాత్రం అందుకు బిన్నంగా ఉంది. ఎండాకాలం ప్రారంభంలోనే ఇంత ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే.. ఏప్రిల్, మే నెలల్లో ఎండలు మండిపోయే అవకాశం ఉంది.