ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కర్తవ్యపథ్‌లో జరిగిన దళాల పరేడ్ ఆకట్టుకుంది. అనంతరం ఆయా రాష్ట్రాలకు సంబంధించిన శకటాల ప్రదర్శన వీక్షకులను అబ్బురపరిచింది. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ శకటాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చప్పట్లు కొట్టి ప్రశంసించారు.
కర్తవ్యపథ్‌లో ప్రదర్శింపబడిన తెలంగాణ శకటం ఉద్యమ తీరును గుర్తుచేసింది. శకటంలో ఉద్యమ పోరాటం, అమరుల త్యాగాలను గుర్తుచేస్తూ శకటం రూపుదిద్దుకుంది. ప్రస్తుతం తెలంగాణ ఉద్యమం నుంచి అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నట్లుగా శకటాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ రూప చిత్రాన్ని కళాకారులు ప్రదర్శనల ద్వారా తెలియజేశారు.
Read Also: Challa Vamshi Chand Reddy: మీలా రోజుకో పార్టీ మారే రకం కాదు.. డీకే అరుణ కు చల్లా వంశీ కౌంటర్
అలాగే ఆంధ్రప్రదేశ్ శకటం కూడా వీక్షకులను ఆకర్షించింది. ఏపీ ప్రభుత్వం విద్యకు అలాంటి ప్రాధాన్యత ఇస్తుంది.. విద్యార్థులను ఏ విధంగా తీర్చిదిద్దుతోందో తెలియజేసే విధంగా శకటం రూపించబడింది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా విద్యార్థులను తీర్చిదిద్దతున్నట్లు శకటం రూపంలో ప్రదర్శించారు. నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ బడులు కార్పొరేట్ స్కూళ్ల మాదిరిగా తయారు చేసినట్లు చెప్పకనే శకటం ద్వారా వెల్లడిపరిచారు.
ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. పరేడ్‌లో జరిగిన విన్యాసాలను ప్రధాని మోడీ, రాష్ట్రపతి ముర్ముతో కలిసి వీక్షించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు, ఆయా పార్టీల నేతలు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.