Election Commission: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈరోజు జిల్లా వారీ అబ్జర్వర్లతో కీలక సమీక్ష సమావేశం నిర్వహించనుంది. వచ్చే వారంలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. జిల్లా స్థాయిలో ఎన్నికల ఏర్పాట్లు, అధికారులు చేపట్టాల్సిన బాధ్యతలు, భద్రతా చర్యలు, పోలింగ్ ఏర్పాట్లపై ఈ సమావేశంలో స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, ఈసీ చర్యలు అధికార యంత్రాంగాన్ని ఉత్సాహపరుస్తున్నాయి.
మరోవైపు.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సన్నాహాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ రాణి కుమిదిని, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్ రెడ్డిలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులు, సంబంధిత అధికారులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ.. గత ఎన్నికల నిర్వహణలో ఎదురైన అనుభవాలను పరిగణనలోకి తీసుకుని, శాంతిభద్రతల నిర్వహణ సులభతరం చేయడానికి ప్రతి జిల్లాలో ఎన్నికలను మూడు దఫాలుగా నిర్వహించాలని ప్రతిపాదించారు. అంతేకాకుండా ఒక ప్రాంతంలోని ఎన్నికలు పూర్తయిన తర్వాత, మరొక ప్రాంతంలో ఎన్నికలకు మధ్యలో రెండు రోజుల విరామం ఉండాలని డీజీపీ అభిప్రాయపడ్డారు. ఈ విరామం వలన సిబ్బందికి, భద్రతా బలగాలకు తగిన సమయం లభిస్తుందని, బందోబస్తు నిర్వహణ మరింత సమర్థవంతంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సర్పంచ్ ఎన్నికలు పూర్తయిన రోజు ఫలితాలు సాయంత్రం ప్రకటిస్తున్న నేపథ్యంలో ర్యాలీలు నిర్వహించే అవకాశం ఉన్నందున రెండు రోజుల విరామం అవసరమని స్పష్టం చేశారు.