తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం సైతం పడనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో మంగళవారం ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. విత్తనాలు వేసి వర్షం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న రైతులకు ఇది శుభవార్త అనే చెప్పాలి.
ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈరోజు వర్షాలు కురవనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 30-40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీయనున్నాయి. హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడనుంది. రాష్ట్రంలో ఉరుములతో కూడిన వర్షం పడనున్న నేపథ్యంలో జనాలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
Also Read: Today Astrology: బుధవారం దినఫలాలు.. ఆ రాశి వారికి ఊహించని డబ్బు!
తెలంగాణ వ్యాప్తంగా నిన్న విస్తారంగా వర్షాలు కురిశాయి. మంగళవారం మహబూబాబాద్ జిల్లా గార్లలో 85.3 మిమీ వర్షం కురిసింది. భద్రాద్రి జిల్లా బుర్గంపహాడ్‌లో 72.3 మిమీ, ఖమ్మం జిల్లా సింగరేణి ప్రాంతంలో 62 మిమీ వర్షం పడింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని సెంట్రల్ & సౌత్ సిటీలో మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. షేక్‌పేట 43.8 మిమీ, బంజారాహిల్స్ 43 మిమీ, ఖైరతాబాద్ 40 మిమీ, గన్‌ఫౌడ్రీ 37 మిమీ, మలక్‌పేట 37 మిమీ వర్షం కురిసింది.