Site icon NTV Telugu

TG Police: పాస్‌పోర్ట్ ధృవీకరణలో తెలంగాణ భేష్.. టీజీ పోలీసుల శాఖకు జాతీయ స్థాయి గుర్తింపు..

Telangana Police

Telangana Police

2024-25 ఆర్థిక సంవత్సరానికి పాస్‌పోర్ట్ దరఖాస్తుల ధృవీకరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించినందుకు గుర్తింపుగా, విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలంగాణ పోలీసులకు “సర్టిఫికేట్ ఆఫ్ రికగ్నిషన్”ను ప్రదానం చేసింది. జూలై 24, 2024న న్యూఢిల్లీలో జరిగిన పాస్‌పోర్ట్ సేవా దివస్ కార్యక్రమంలో ఈ ప్రశంసా పత్రాన్ని తెలంగాణ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ బి. శివధర్ రెడ్డి ఐసీఎస్ స్వీకరించారు. విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గెరిటా హాజరై గుర్తింపు పత్రాన్ని అందించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 8,06,684 పాస్‌పోర్ట్ దరఖాస్తుల ధృవీకరణను తెలంగాణ పోలీసులు విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ధృవీకరణలు పూర్తిగా నిర్ణీత వ్యవధి (15 రోజులలోపు) పూర్తయ్యాయి. వాస్తవానికి, తెలంగాణలో పాస్‌పోర్ట్ ధృవీకరణలకు తీసుకున్న సగటు సమయం 7 రోజులకు కూడా తగ్గిందనే ప్రశంసనీయమైన ఘనతను సాధించారు.

READ MORE: CM Revanth Reddy: రాబోయే రోజుల్లో అనేక సవాళ్లు.. సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు సీఎం ఆదేశాలు..

ధృవీకరణ ప్రక్రియను వేగవంతం చేయడానికి, ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడానికి, తెలంగాణ పోలీసులు స్వయంగా అభివృద్ధి చేసిన ‘సత్యాపన్’, ‘వెరిఫాస్ట్’ సాఫ్ట్‌వేర్‌లు కీలక పాత్ర పోషించాయి. ఫేస్ రికగ్నిషన్, డేటా మ్యాచింగ్ టెక్నాలజీలతో కూడిన ఈ సిస్టమ్‌లు సీసీటీఎన్ఎస్, పాత పాస్‌పోర్ట్ దరఖాస్తు డేటా, ఇతర డేటాబేస్‌లతో సరిపోల్చడం ద్వారా దరఖాస్తుదారులకు ఏమైనా నేరచరిత్ర ఉంటే త్వరగా గుర్తించగలుగుతున్నాయి. 2014 నుంచి ఇప్పటి వరకు ఆరుసార్లు తెలంగాణ పోలీసుశాఖ ఈ విషయంలో ఉత్తమ ప్రదర్శన కలిగిన రాష్ట్రాల జాబితాలో స్థానం దక్కించుకోవడం గర్వకారణం. ఇది పబ్లిక్ సర్వీసు పట్ల పోలీసుశాఖ చూపిన నిబద్ధతకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ మేరకు, 2024-25లో తెలంగాణ పోలీసులకు లభించిన ఈ జాతీయ గుర్తింపుపై, రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ అన్ని యూనిట్ల అధికారులను, ప్రత్యేక బ్రాంచ్ అధికారులను, సంబంధిత సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. పౌరులకు వేగవంతమైన, పారదర్శకమైన, అవినీతి రహిత సేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్రం మూడు ప్రధాన లక్ష్యాలపై దృష్టి సారించింది. అవేంటంటే..

1. ఫూల్ ప్రూఫ్ వెరిఫికేషన్
2. సకాలంలో అప్లికేషన్ల పరిష్కారం
3. పూర్తిగా అవినీతిరహిత విధానం

Exit mobile version