MLA Defection Case: తెలంగాణలో రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసిన ఎమ్మెల్యేల పిరాయింపు కేసు నేడు సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. ఢిల్లీలోని సుప్రీం కోర్టులో జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్‌ల ధర్మాసనం ఈ వ్యవహారంపై విచారణ చేపట్టనుంది. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తీర్పు వెలువరించారు. ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పష్టం చేస్తూ అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. అయితే ఈ నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో విషయం సుప్రీం కోర్టు వరకు చేరింది.
WPL 2026 : ముంబయి కోటను బద్దలు కొట్టిన యూపీ వారియర్స్.!
గత విచారణ సందర్భంగా స్పీకర్ నాలుగు వారాల్లోగా కోర్టు ధిక్కార పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అలాగే స్టాండింగ్ కౌన్సిల్ ద్వారా స్పీకర్‌కు నోటీసులు జారీ చేయాలని పేర్కొంది. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకరేనా? లేక కోర్టా? అన్న కీలక ప్రశ్నలను కూడా ధర్మాసనం లేవనెత్తింది. తెలంగాణ ఎమ్మెల్యేల పిరాయింపు వ్యవహారంలో మూడు నెలల పాటు నిర్ణయం తీసుకోలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై స్పీకర్‌కు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.
స్పీకర్ తరపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింగ్, ముకుల్ రోహత్గి హాజరై నాలుగు వారాల్లో విచారణ పూర్తి చేస్తామని గతంలో కోర్టుకు తెలియజేశారు. నేటి విచారణలో ఈ అంశంపై సుప్రీం కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారింది.