Indiramma Saree: ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రత్యేక బహుమతిగా కోటి ఇందిరమ్మ చీరలను అందజేయడానికి సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన చీరల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంపై మంగళవారం మంత్రి సీతక్కతో పాటు ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. అర్హులైన ప్రతి మహిళకు చీర అందాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం రెండు దశల్లో చేపడుతోంది. మొదటి దశలో బుధవారం నుంచి డిసెంబర్ 9వ తేదీ తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. రెండో దశలో మార్చి 1 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయిన మార్చి 8 వరకు పట్టణ ప్రాంతాల్లో పంపిణీ చేయనున్నారు.
READ MORE: Trump-Epstein: ఎప్‌స్టీన్ ఫైళ్ల విడుదల బిల్లుకు చట్టసభ ఆమోదం.. ట్రంప్ ఏం చేయబోతున్నారో..!
ఈ పంపిణీ కోసం చీరలను పూర్తిగా సిరిసిల్ల చేనేత కార్మికులే తయారు చేస్తున్నారు. ఇప్పటికే 55 లక్షల చీరలు సిద్ధంగా ఉండగా, మరో ఐదు లక్షలు త్వరలో పూర్తికానున్నాయి. ఉత్పత్తి ఆలస్యాలు ఉన్నప్పటికీ, తయారీకి అనుగుణంగా పంపిణీ ఘటించిన పద్ధతిలో జరుగుతుందని అధికారులు తెలిపారు. చీరల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని ముఖ్యమంత్రి స్పష్టంగా ఆదేశించారు. మహిళలకు నాణ్యమైన చీరలు చేరాలని, పంపిణీ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని సూచించారు. సాంకేతికతను వినియోగించి ప్రతి దశను పర్యవేక్షించాలన్నారు. మహిళా సంఘాల్లో చేరేందుకు మహిళలను ప్రోత్సహించాలంటూ కూడా సూచనలు ఇచ్చారు. బుధవారం జరిగే ప్రారంభ కార్యక్రమానికి దగ్గరి జిల్లాల నుంచి 500 మంది మహిళలను తీసుకువస్తున్నారు. కార్యక్రమం అనంతరం సెక్రటేరియట్ నుంచి రాష్ట్రంలోని మహిళలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడనున్నారు. గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పంపిణీకి సంబంధించిన ఆదేశాలను సెర్ప్ జారీ చేయనుంది.