Heart Attack : ముప్పై ఏళ్లు నిండక ముందే నేడు యువత గుండెపోటుకు బలవుతున్నారు. రోజురోజుకు గుండెపోటు మరణాలు పెరిగిపోతున్నాయి. సడన్ గా గుండెపోటు రావడంతో అందుబాటులో ప్రాథమిక చికిత్సలేకపోవడం వల్ల చాలామంది మృత్యువాతపడుతున్నారు. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కార్డియోపల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్)లో లక్షమందికి శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని సర్కార్ మొదలుపెట్టింది. సడన్ గా గుండెపోటుకు గురైన వారికి చికిత్స అందజేసేందుకు ఆటోమెటిక్ ఎక్స్‌టర్నల్ డీఫిబ్రిలేటర్ (ఏఈడీ) పరికరాలను తెప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. సుమారు 1400 పరికరాలకును పబ్లిక్ ప్లేస్‌లలో అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
ఆటోమెటిక్ ఎక్స్‌టర్నల్ డీఫిబ్రిలేటర్ (ఏఈడీ) ఏంటీ పరికరం ?
గుండెపోటు బాధితులకు ఆటోమెటిక్ ఎక్స్‌టర్నల్ డీఫిబ్రిలేటర్ (ఏఈడీ) అపర సంజీవనిగా నిలుస్తుంది. ఈ పరికరం దవాఖానకు వెళ్లేలోపు అత్యవసర చికిత్సను అందజేస్తుంది. ప్రపంచస్థాయి నగరాల్లో ఇప్పటికే పబ్లిక్ యాక్సెస్ డీఫీబ్రిలేటర్లు గుండెపోటు బాధితుల ప్రాణాలను నిలుపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ముఖర్జీ ఇతర దేశాల్లో మాదిరిగా హైదరాబాద్‌లోనూ పబ్లిక్ యాక్సెస్ డీఫిబ్రిలేటర్లను ఏర్పాటుచేయాలని ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్‌ను కోరారు. ఈ ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్.. మొదటి విడతలో 1400 డీఫిబ్రిలేటర్లకు ఆర్డర్ ఇచ్చినట్టు ప్రకటించారు. వీటిని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు, మాల్స్, ప్రభుత్వ కార్యాలయాలవంటి బహిరంగ ప్రదేశాల్లో అందుబాటులోకి తేనున్నారు.
ఏఈడీ ఎలా పనిచేస్తుంది ?
ఎవరికైనా గుండెపోటు వస్తే 999 ఎమర్జెన్సీ నంబర్‌కు డయల్ చేయాలి. సంబంధిత ఆపరేటర్ డీఫిబ్రిలేటర్ పరికరం ఉన్న సమీప ప్రాంతం వివరాలను తెలియజేస్తారు. గ్రీన్ బటన్ నొక్కి డీఫిబ్రిలేటర్‌ను ఆన్ చేశాక.. ఆ పరికరం వాయిస్ రూపంలో ఇచ్చే సూచనలను పాటించాల్సి ఉంటుంది. స్టిక్కీ ప్యాడ్‌లను రోగి ఛాతిపై అమర్చాలి. ప్యాడ్‌లను అమర్చిన తర్వాత అప్పటివరకు చేసిన కార్డియోపల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్)ను ఆపివేయాలి. పరికరం రోగి గుండె లయను పరీక్షించి షాక్ అవసరమా? లేదా! అన్నది నిర్ణయిస్తుంది. షాక్ అవసరమైతే..షాక్ బటన్ నొక్కాలని చెప్తుంది. షాక్ ప్రక్రియ పూర్తయ్యాక సీపీఆర్ కొనసాగించాలా? వద్దా? అన్నది కూడా డీఫిబ్రిలేటర్ తెలియజేస్తుంది. గుండె లయకు సంబంధించిన సంకేతాలను చూపించే వరకు.. ఆపరేటింగ్‌ను ఆపివేయాలని డీఫిబ్రిలేటర్ చెప్పేవరకూ ఈ ప్రక్రియను కొనసాగించాలి. ఈ అత్యవసర చికిత్సతో ప్రాణాపాయం నుంచి రోగిని రక్షించవచ్చు.