TG Governor: తెలంగాణ సిద్ధాంత కర్త, ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా రాజ్‌భవన్‌లో కార్యక్రమాన్ని నిర్వహించారు. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను యావత్ ప్రపంచానికి చాటి చెప్పి ప్రత్యేక రాష్ట్ర సాధనకు జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయుడు జయశంకర్ అని ఆయన అన్నారు. అంతకు ముందు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా జయశంకర్‌కు నివాళులు అర్పించారు. ట్విట్టర్‌లో కేటీఆర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పుట్టుక మీది.. చావు మీది.. బతుకంతా తెలంగాణది అని జయశంకర్ సార్ చెప్పిన మాటలను గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని ధారబోసిన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు.
Read Also: Minister Thummala: ఆగస్టు 15న రూ.2 లక్షల వరకు రుణమాఫీ.. మంత్రి కీలక ప్రకటన
” తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి జయశంకర్ సార్ చేసిన కృషి అనిర్వచనీయం అంటూ.. స్వరాష్ట్ర సాధనలో ఒక దిక్సూచిగా నిలిచిన వారి కీర్తి అజరామరమైనదని, వారి స్ఫూర్తి మరిచిపోలేనిది అని కొనియాడారు. ఇక సార్ అడుగుజాడల్లోనే తెలంగాణ రాష్ట్ర పోరాటం కొనసాగిందని, తెలంగాణ ప్రగతి ప్రస్థానానికి అడుగులు పడ్డాయని చెబుతూ.. చివరగా జోహార్ జయశంకర్ సార్!, జై తెలంగాణ” అని కేటీఆర్ నినదించారు. కాగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ కీలక పాత్ర పోషించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటానికి విద్యార్థులను, నాయకులను ఏకం చేస్తూ.. ఉద్యమానికి ఊపిరులు ఊదుతూ.. రాష్ట్ర సాధనే జీవిత లక్ష్యంగా జీవించారు. చివరికి రాష్ట్ర సాధనకు ముందే 2011, జూన్ 21న తుదిశ్వాస విడిచారు.