Ration Cards: తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరి వంటి పథకాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేయనుంది. ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోనివారికి ఇప్పుడు వెసులుబాటు కల్పిస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నుండి ప్రారంభమైన గ్రామ సభల్లో ఈ పథకాలకు దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేసారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణా రావు, మంత్రి దనసరి అనసూయ, ఇతర ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్లతో సచివాలయం ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పలు కీలక విషయాలు చర్చించారు.
Also Read: MEIL: తెలంగాణలో రూ.11 వేల కోట్ల పెట్టుబడులతో మెఘా ఇంజనీరింగ్ కీలక ఒప్పందాలు
జనవరి 21 నుండి 24 వరకు గ్రామ సభలు కొనసాగనున్నాయి. ఈ సభలలో గతంలో దరఖాస్తు చేసుకోని వారు కూడా ఇప్పటికీ దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు, రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అమలు చేయబడతాయని, దాదాపు రూ. 40 వేల కోట్ల వ్యయం ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, రేషన్ కార్డుల జారీ రెండు పథకాలు గతంలో తొలగించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో పది సంవత్సరాల తరువాత ఈ పథకాలకు అత్యధికంగా దరఖాస్తులు వస్తున్నాయని.. గ్రామ సభలలో ఇప్పటికే వచ్చిన దరఖాస్తుదారులలో ఇల్లు లేని వారు, ఇల్లు లేకున్నా స్థలం ఉన్నవారిని గుర్తించి జాబితా చేయాలని అధికారులకు మంత్రులు సూచించారు.
Also Read: JEE Mains Exams: రేపటి నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షలు.. విద్యార్థులకు కీలక సూచనలు..!
రేషన్ కార్డుల జారీకి సంబంధించి అర్హులైన వారి జాబితాను త్వరలో విడుదల చేస్తామని, అన్ని దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అర్హులైన వారిని ప్రకటిస్తామని పేర్కొన్నారు. వీటి కోసం దరఖాస్తుదారుల పేరు, ఆధార్ నంబర్, చిరునామా, ఇంటి అడ్రస్ వంటి వివరాలను సేకరించాల్సిందిగా తెలిపారు. ముఖ్యంగా గ్రామ సభలు విజయవంతంగా నిర్వహించామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 4098 గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించబడ్డాయని, అందుకు జిల్లా కలెక్టర్లను అభినందించారు. ఈ పథకాలు ప్రజలకు సక్రమంగా అందేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది.