కొత్త మద్యం బ్రాండ్లపై సీఎం రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త కంపెనీలకు అనుమతులు ఇచ్చే విషయంలో పారదర్శక విధానం రూపొందించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఏడాదిలో ఎప్పుడు పడితే అప్పుడు కొత్త బ్రాండ్లకు దరఖాస్తు చేసుకునే అవకాశముండేది. ఎవరికి పడితే వారికి అనుమతించే విధానముండేది. ఇకపై ఎప్పుడు పడితే అప్పుడు దరఖాస్తులు తీసుకోవద్దని.. కట్టుదిట్టంగా కొత్త కంపెనీలకు అనుమతులు ఇచ్చే విధానం అనుసరించాలని సూచించారు. నోటిఫికేషన్ జారీ చేసి నిర్ణీత వ్యవధిలో దరఖాస్తులు స్వీకరించాలన్నారు. దరఖాస్తు చేసుకున్న కంపెనీల నాణ్యత, మార్కెట్లో వాటికి ఉన్న ఆదరణ, సరఫరా సామర్థ్యం ఆధారంగా కొత్త కంపెనీలకు అనుమతి ఇవ్వాలని పేర్కొన్నారు.
READ MORE: Kangana Ranaut: ‘ఎమర్జెన్సీ’ మూవీ స్పెషల్ షో.. కంగనను ప్రశంసించిన కేంద్ర మంత్రి
“ఇష్టమోచ్చిన చెత్త పేర్లతో వచ్చేవి.. నాసిరకం కంపెనీలకు నో ఎంట్రీ. బీరు బిర్యానీ లాంటి బీర్ బ్రాండ్లకు చెక్ పెట్టాలి. ఇప్పటికే రాష్ట్రంలో బీర్లు, లిక్కర్ సరఫరా చేస్తున్న కంపెనీలు మళ్లీ మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. పాత కంపెనీలు కొత్త బ్రాండ్లు ఉత్పత్తి చేస్తే ఈజ్ ఆఫ్ డూయింగ్ విధానంలో వాటిని పరిశీలించి అనుమతించే పద్ధతి అనుసరించాలి. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ వద్ద పెండింగ్లో ఉన్న మైక్రో బ్రూవరీలు, ఎలైట్ బార్ల అప్లికేషన్లు, ఖాళీగా ఉన్న ఎలైట్ బార్లు, ఖాళీగా ఉన్న మద్యం షాపుల కేటాయింపుల విషయంలో త్వరలో కొత్త విధానం తెస్తున్నాం. గతంలో టానిక్ లాంటి ఎలైట్ షాపులకు అనుమతించటంతో బడా వ్యాపారులు ఎక్సైజ్ శాఖను తమ గుప్పిట పెట్టుకున్నారు. తాము ఆడిందే ఆట అన్నట్లుగా ఎక్సైజ్ శాఖ ఆదాయానికి భారీగా గండి కొట్టారు. ఇకపై అలాంటి పరిస్థితి లేకుండా ఎక్సైజ్ శాఖ కట్టుదిట్టంగా వ్యవహరించాలి.” అని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించి ఎక్సైజ్ ఆదాయం గండి పడకుండా కొత్త ప్రతిపాదనలకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.