Konda Surekha : అసెంబ్లీలో అటవీ శాఖపై మాట్లాడిన మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రభుత్వం అటవీ అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్న నేపథ్యంలో అడవులను సంరక్షించి, పచ్చదనం పెంచడం అత్యంత అవసరం అని ఆమె తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం 2025-26 బడ్జెట్‌లో అటవీ శాఖకు రూ.1,023 కోట్లను కేటాయించింది. అటవీ విస్తీర్ణాన్ని ప్రస్తుత 23% నుంచి 33% వరకు పెంచే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు ఆమె వెల్లడించారు. గత బీఆర్ఎస్ హయాంలో హరితహారం పేరుతో నిధుల దుర్వినియోగం జరిగిందని, కానీ ప్రస్తుత ప్రజా ప్రభుత్వం ప్రతి పైసాను సమర్థంగా వినియోగించేందుకు కంకణం కట్టుకుందన్నారు.
2024-25లో 20.02 కోట్ల మొక్కలు నాటే లక్ష్యం, ఇప్పటివరకు 16.75 కోట్ల మొక్కలు (84%) నాటివేసినట్లు మంత్రి తెలిపారు. ఆర్భాటం, ప్రచారాలకు భిన్నంగా క్షేత్రస్థాయిలో మొక్కలు నాటడం, వాటిని పరిరక్షించడానికే ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. నగరాలు, పట్టణాల్లో పచ్చదనం పెంపు కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో “నగర్ వన యోజన” కింద రూ.18.09 కోట్లతో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.
తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ సహకారంతో ఖమ్మం జిల్లాలో కనకగిరి, వికారాబాద్‌లో అనంతగిరిలో పర్యావరణహిత పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేస్తున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్, హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కును “ప్రభుత్వ – ప్రైవేటు భాగస్వామ్యం (PPP)” విధానంలో అభివృద్ధి చేస్తున్నారు.
కవ్వాల్ టైగర్ రిజర్వ్ జోన్ నుంచి మొట్టమొదటిసారిగా రెండు గ్రామాలను విజయవంతంగా తరలించారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని మైసంపేట్, రాంపూర్ గూడేలను తొలివిడత తరలింపు పూర్తయింది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ నుంచి నాలుగు గ్రామాల తరలింపు పనులు కొనసాగుతున్నాయి. కవ్వాల్ టైగర్ రిజర్వ్‌ను మహారాష్ట్ర తడోబా టైగర్ రిజర్వ్‌తో కలిపే 1442.26 చదరపు కి.మీ అటవీ ప్రాంతాన్ని “కన్జర్వేషన్ రిజర్వ్”గా ప్రకటించేందుకు ప్రతిపాదనలు పంపారు.
వన్యప్రాణుల దాడులతో మరణించిన వారి కుటుంబాలకు నష్టపరిహారాన్ని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచారు. గత ప్రభుత్వ హయాంలో ఆక్రమణలకు గురైన 17,643.30 ఎకరాల అటవీ భూమిని ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరిగి స్వాధీనం చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం పచ్చదనం పెంపు, అటవీ సంరక్షణ, పర్యావరణ అనుకూల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి కొండా సురేఖ తెలిపారు.
Jupally Krishna Rao : తెలంగాణ పర్యాటక అభివృద్ధిపై మంత్రి జూపల్లి కీలక ప్రకటన