తెలంగాణ రాష్ట్రంలో మరోసారి బంద్ దిశగా ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు అడుగులు వేస్తున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయని నేపథ్యంలో 2025 దసరా పండగ తర్వాత (అక్టోబర్ 6 నుంచి) విద్యా సంస్థలు తెరవొద్దని కాలేజీ యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే విద్యా సంస్థలు బంద్‌పై కాలేజీ యాజమాన్యాలు అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.
ఇటీవల రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. సెప్టెంబర్ 15 నుంచి నిరవధిక బంద్‌కు కాలేజీల యాజమాన్యాలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. బంద్ విద్యార్థుల చదువుపై ప్రభావం చూపుతుందని ప్రభుత్వం కాలేజీల యాజమాన్యాలతో చర్చలు జరిపింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన చర్చలలో కాలేజీల యాజమాన్యాలు వెనక్కి తగ్గాయి. ప్రభుత్వంతో చర్చల అనంతరం దసరా వరకు పెండింగ్‌లో ఉన్నమొత్తం బకాయిల్లో రూ.600 కోట్లను విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం చెప్పారు. అయితే డిప్యూటీ సీఎం ప్రకటన చేసి రెండు వారాలు గడుస్తున్నా.. ప్రభుత్వం ఇంకా బిల్లులను విడుదల చేయలేదు.
Also Read: Mohsin Naqvi: బీసీసీఐకి మోసిన్ నఖ్వీ క్షమాపణలు.. కానీ మళ్లీ ఓ మెలిక పెట్టాడుగా!
పెండింగ్ బకాయిలు ప్రస్తుతం ఇచ్చే పరిస్థితి లేదని ప్రభుత్వం కాలేజీల యాజమాన్యాలకు స్పష్టం చేసినట్టు సమాచారం. దాంతో భవిష్యత్ కార్యాచరణకు ప్రైవేట్ ఇంజనీరింగ్, వృత్తి విద్యా కాలేజీలు సిద్దం అవుతున్నాయి. ఇందులో భాగంగా ఫెడరేషన్ అఫ్ అసోసియేషన్స్ అఫ్ తెలంగాణ హైయ్యర్ ఎడ్యుకేషన్స్ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు అత్యవసర మీటింగ్ జరిగింది. కాలేజీలు బంద్ చేయాలనే మెజారిటీ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారంట. దసరా తర్వాత విద్యా సంస్థలు తెరవోద్దనే ఆలోచనలో యాజమాన్యాలు ఉన్నాయని తెలుస్తోంది. యాజమాన్య సంఘాలు మరి కాసేపట్లో తమ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్న తెలుస్తోంది.