NTV Telugu Site icon

Etela Rajender : పేదల భూముల కబ్జాలపై ఈటల ఆగ్రహం.. అతడి చెంప చెళ్లుమనిపించిన ఈటల

Etela Rajender

Etela Rajender

Etela Rajender : మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పోచారంలో ఉద్రిక్తత నెలకొంది. పేదల భూములు కబ్జా చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌ చెంప చెల్లుమనిపించారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీలోని ఏకశిలానగర్‌లో జరిగింది, దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.

బాధితులు, రియల్ వ్యాపారులు పేదల భూములను అక్రమంగా కబ్జా చేస్తున్నారన్న విషయాన్ని ఎంపీ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన ఈటల, మేడ్చల్ జిల్లాలో పర్యటించారు. పేదల భూముల అక్రమ వ్యాపారం తనకు తెలిసిన వెంటనే అక్కడే ఉన్న రియల్ ఎస్టేట్ బ్రోకర్‌ను ప్రశ్నించడమే కాకుండా, ఆగ్రహంతో చేయిచేసుకున్నారు.

 Nara Lokesh: పెట్రో కెమికల్‌ హబ్‌ ఏర్పాటు కోసం.. ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్‌తో మంత్రి లోకేష్ భేటీ!

ఈ ఘటన అనంతరం మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్, పేదల భూములు కబ్జా చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. “కొందరు రియల్ వ్యాపారులు పేదల భూములను అక్రమంగా హస్తగతం చేసుకుంటున్నారు. ఇది నేరం. తప్పు చేసే బ్రోకర్లకు కొమ్ముకాస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి,” అని ఘాటుగా విమర్శించారు.

ఈటల రాజేందర్ మాట్లాడుతూ, “1985లో నారపల్లి, కొర్రెముల ప్రాంతాల్లో పేదలు కష్టపడి కొనుగోలు చేసిన భూములను కబ్జా చేస్తూ రియల్ వ్యాపారం చేస్తున్నారు. బ్రోకర్ల వల్ల బాధపడుతున్న పేదలకు బీజేపీ అండగా ఉంటుంది. పేదల భూములను కాపాడటం మా బాధ్యత,” అని హామీ ఇచ్చారు.

అంతేకాక, “తప్పు భూములు కొనుగోలు చేసిన వారికంటే కూడా దొంగ పత్రాలు సృష్టించే అధికారులదే తప్పు. వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని, జైలులో పెట్టాలని” డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో పరిపాలనా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈటల, “చిన్న జిల్లాలను ఏర్పాటు చేస్తే పాలన సులభం అవుతుందని భావించాం. కానీ కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదు. అయితే, బ్రోకర్లకు మాత్రం పూర్తి సహకారం అందిస్తున్నారు,” అంటూ ఘాటుగా విమర్శించారు.

పేదల భూములను కబ్జా చేయడానికి ప్రయత్నించే ఎవరికైనా ఖబడ్దార్ అంటూ హెచ్చరించిన ఈటల, “బ్రోకర్ల దౌర్జన్యాలకు బీజేపీ భయపడదు. పేదల కోసం పోరాడుతూనే ఉంటాం,” అని అన్నారు. ఈ ఘటన తెలంగాణలో రాజకీయ ఉత్కంఠను పెంచడంతో పాటు, పేదల హక్కుల కోసం ఈటల రాజేందర్ తీసుకుంటున్న చర్యలు చర్చనీయాంశమయ్యాయి.

 
Trump Diet Coke Button: అమెరికా అధ్యక్ష భవనంలోని ట్రంప్ టేబుల్పై డైట్ కోక్ బటన్..