Betting Apps : తెలంగాణలో బెట్టింగ్ యాప్‌ల ప్రచారం విషయంలో దర్యాప్తు వేగవంతమవుతోంది. మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు నేపథ్యంలో ఇప్పటికే 25 మందిపై కేసు నమోదు కాగా, ప్రముఖ నటులు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి, అనన్య నాగిళ్ళలతో పాటు మరో 20 మంది పై విచారణ కొనసాగుతోంది. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినందుకు బి.ఎన్.ఎస్ లోని 318(4), 112 రెడ్ విత్ 49, తెలంగాణ గేమింగ్ యాక్ట్ లోని 3, 3(ఏ), 4 సెక్షన్ల కింద, అలాగే ఐటీ యాక్ట్ లోని 66(డి) కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసులో ఇప్పటివరకు పలువురు ప్రముఖులు తమ వైఖరిని ప్రకటించారు. నటుడు విజయ్ దేవరకొండ తన ప్రచారం ఆన్‌లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్‌కు మాత్రమే పరిమితమని పేర్కొనగా, రానా దగ్గుబాటి కూడా తాను నైపుణ్య ఆధారిత గేమ్‌లను మాత్రమే ప్రమోట్ చేశానని స్పష్టం చేశాడు. మరోవైపు ప్రకాశ్ రాజ్ తన ఎక్స్ (Twitter) అకౌంట్ ద్వారా వీడియోను పోస్ట్ చేసి, 2016 లో మాత్రమే ఈ యాప్‌లకు ప్రచారం చేశాను. కానీ, ఆ తర్వాత అవి తప్పుడు మార్గంలో వెళ్తున్నాయని గుర్తించి 2017 నుంచి పూర్తిగా ప్రమోట్ చేయడం మానేశాను అని వివరించాడు.
సెలబ్రిటీల ప్రచారం వల్ల బెట్టింగ్ యాప్‌ల ప్రభావం పెరిగిందని పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా, ఆర్థికంగా నష్టపోయిన అనేక మంది యువకులు, ఉద్యోగులు, విద్యార్థులు ఈ యాప్‌ల వలన భారీగా నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయారని తేలింది. దర్యాప్తులో వెల్లడైన మరొక షాకింగ్ నిజం ఏమిటంటే, గత ఏడాది కాలంలో ఈ బెట్టింగ్ యాప్‌ల కారణంగా తెలంగాణ వ్యాప్తంగా 15 మంది ఆత్మహత్య చేసుకున్నారు.
పోలీసులు ఇప్పటివరకు 15 కేసులను నమోదు చేసి, బాధితుల వివరాలను సేకరిస్తున్నారు. బాధితుల కుటుంబసభ్యులను ప్రశ్నించి, అసలు ఈ యాప్‌లు ఎలా పనిచేస్తున్నాయి, వీటి ముళ్ల చుట్టూ మోసపోయిన వారి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
కేసు నమోదైన 25 మంది స్టేట్‌మెంట్లను రికార్డ్ చేయడానికి మియాపూర్ పోలీసులు సిద్ధమవుతున్నారు. త్వరలోనే సంబంధిత సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేయనున్నారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయడంపై, ప్రజల ఆర్థిక నష్టంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, అందులో భాగమైనవారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌లపై కఠిన నియంత్రణలు విధించాలని చూస్తోంది. ఈ కేసు మరింతగా ఉత్కంఠ రేపుతుండగా, సినీ తారల ప్రమోషన్ల కారణంగా ప్రజలకు ఎంతమేరకు నష్టం జరిగిందో స్పష్టత రావాల్సి ఉంది. మరి, ఈ దర్యాప్తు ఎంతవరకు ముందుకు సాగుతుందో, ప్రమోషన్ చేసిన సెలబ్రిటీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారా? అన్నదే ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది.
సైబర్ సెక్యూరిటీ బ్యూరో అడిషనల్ ఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్స్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్యపై సరైన క్లారిటీ లేదన్నారు. 2017 గెమింగ్ యాక్ట్ ప్రకారం తెలంగాణాలో ఆన్లైన్ గెమింగ్ బ్యాన్ అయిందని, మొత్తం 108 ఇల్లీగల్ యూఆర్‌ఎల్ లను బ్లాక్ చేసామన్నారు. చైనీస్ యూఆర్‌ఎల్‌లను ఫాలో కాకుండా అనేక ఇల్లీగల్ URL లను పంపుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు తమ మొబైల్స్ ద్వారా వచ్చే పాప్ అప్స్ పైన సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేస్తే వాటిని బ్లాక్ చేస్తామని ఆయన పేర్కొన్నారు. వేరు వేరు ప్రాంతలనుంచి ఫేక్ GPS ద్వారా jio ఫెన్సింగ్ యాక్సెస్ జరుగుతుందని, స్కిల్ గేమింగ్ అని చెప్పే మాటలు అబద్దమన్నారు ఎస్పీ ప్రసాద్. ఆన్లైన్ గెమింగ్ ద్వారా నష్టపోయిన ఒక్క గేమింగ్ కంపెనీ లేదని, గేమింగ్ కంపెనీ ఏర్పాటు చేసిన సాఫ్ట్ వేర్ వారు పన్నిన పన్నాగం మాత్రమే అని ఆయన వ్యాఖ్యానించారు. స్కిల్ గేమ్స్, ఆన్లైన్ గేమ్స్ కు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. స్కిల్ గేమ్ నాన్ స్కిల్ గేమ్స్ తో సంబంధం లేదు.. ప్రతి ఆన్లైన్ గేమ్ వలన నష్టాలు ఉన్నాయని, స్కిల్ గేమ్స్, నాన్ స్కిల్ గేమ్స్ పైన లీగల్ అభిప్రాయాలు తీసుకుని ముందుకు వెళ్తామన్నారు. భారత చట్టాల ప్రకారం ఇన్ఫ్లుయెన్సర్లపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
Samantha : ఓటీటీ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న సమంత..