Beerla Ilaiah : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ నేతల తీరును తీవ్రంగా విమర్శించారు. గవర్నర్ ప్రసంగాన్ని అవహేళన చేయడం తగదని, కనీసం గవర్నర్ ప్రసంగాన్ని గౌరవించే సంస్కృతి కూడా బీఆర్‌ఎస్ నేతలకు లేదని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ముందుగా అసెంబ్లీకి హాజరై సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రభుత్వ విప్ సూచించారు. ప్రతిపక్షంగా ఉన్న బీఆర్‌ఎస్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను పట్టించుకోవడం లేదని, వారు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని ఆయన పేర్కొన్నారు. ప్రజలు వారి తీరును గమనిస్తున్నారని, విపక్షంగా వారు సరిగ్గా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారని ఐలయ్య పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ, కులగణన వంటి కీలక నిర్ణయాలతో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. అయితే, ఈ కులగణనలో కల్వకుంట్ల కుటుంబ సభ్యులు పాల్గొనకపోవడం దుర్మార్గమన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం హయాంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, కాలేశ్వరం ప్రాజెక్టు పేరు మీద భారీగా కమిషన్లు దండుకున్నారని బీర్ల ఐలయ్య విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగిస్తుందని, గత 10 ఏళ్ల పాలనలో బీఆర్‌ఎస్ మిగిల్చిన అప్పులను తగ్గించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్లు రుణమాఫీ చేసినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయలేదని విమర్శించారు. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ, కొత్త పథకాలను రూపొందిస్తున్నామని తెలిపారు.
తెలంగాణ మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చినట్లు బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. పింక్ పార్టీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారాన్ని ఆపాలని, రేవంత్ రెడ్డి తీసుకుంటున్న అభివృద్ధి చర్యలను అడ్డుకోవడం బీఆర్‌ఎస్ ఆలోచనగా మారిందని అన్నారు. తెలంగాణ సచివాలయంలో రాష్ట్రం తల్లికి స్మారకంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని, కానీ కేసీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ప్రతి అంశంలో కమిషన్ల కోసం పనిచేసిన బీఆర్‌ఎస్ ఇప్పుడు అనవసరమైన ఆరోపణలు చేస్తోందని పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్ చేసిన అప్పులు, అవినీతి, పాలనలో చేసిన పొరపాట్లను సీఎం రేవంత్ రెడ్డి సరిదిద్దుతున్నారని బీర్ల ఐలయ్య స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్ అసలు రూపాన్ని అర్థం చేసుకుని, రాబోయే రోజుల్లో సరికొత్త పాలన కోసం సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
Inter Exams : తెలంగాణ ఇంటర్ పరీక్షల్లో తప్పుల పరంపర.. విద్యార్థుల్లో ఆందోళన