Telangana Bhu Bharati: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భూ భారతి బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. డిసెంబర్ 17న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ చట్టానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడితే.. మూడు రోజుల సుదీర్ఘ చర్చ తర్వాత బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. భూ భారతి బిల్లుపై చర్చ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రేవంత్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో ప్రతి సమస్య భూమితోనే ముడిపడి ఉందన్నారు. రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మల్లు స్వరాజ్యం వంటి వారు భూపోరాటాలు చేశారని గుర్తు చేశారు. తెలంగాణలో ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టేది భూమి అని స్పష్టం చేశారు. భూమిని కాపాడుకునే క్రమంలోనే దొడ్డి కొమురయ్య లాంటి వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని రేవంత్ రెడ్డి తెలిపారు. సర్వం ఒడ్డి పోరాటాలు చేసి భూములు కాపాడుకున్నారని.. పేదల భూములను రక్షించేందుకే పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశారని అన్నారు. భూమి లేని పేదలకు ఇందిరాగాంధీ ప్రభుత్వం భూమి ఇచ్చి ఆత్మగౌరవం నిలబెట్టిందన్నారు. ఆక్రమణలు తొలగించి రైతుల హక్కులు కాపాడేందుకు గతంలో ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తెచ్చాయని రేవంత్ రెడ్డి తెలిపారు.
Read Also: Pet Dogs: ఆ పని కోసం పెంపుడు కుక్కను బయటకు తీసుకెళ్తున్నారా? ఇక అంతే..!
విపక్ష పార్టీ అహంభావంతో వ్యవహరిస్తోందని.. స్పీకర్ పట్ల దారుణంగా వ్యవహరించారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్…రైతులను తమ భూములకు దూరం చేసిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. 2010లో ఒడిశా కూడా ఇదే ధరణి విధానాన్ని తీసుకువచ్చినట్లు చెప్పారు. ఒడిశా సర్కారే తప్పు చేసిందని ఎన్ఐసీ, కాగ్ చెప్పాయన్న ఆయన…అనుభవం లేని ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంస్థకు అప్పగించవద్దని హెచ్చరించినట్లు సభ దృష్టికి తీసుకువచ్చారు. యువరాజుకు అత్యంత సన్నిహితులైన వారికి ధరణి పోర్టల్‌ను అప్పగించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ధరణి పోర్టల్ నిర్వహణ ఏ కంపెనీ చేతిలోకి వెళ్లినా సీఈవోగా గాదే శ్రీధర్‌రాజు ఉన్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. విలువైన సమాచారం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. 50 లక్షల రైతుల వివరాలు, భూమి వివరాలను ఓ సంస్థ చేతికి అప్పగించారని అన్నారు. టెరాసిస్ చేతిలో పెట్టిన ధరణి పోర్టల్…పది సంస్థల చేతులు మారిందని రేవంత్ రెడ్డి తెలిపారు. మన ధరణి పోర్టల్ ఫిలిప్పీన్స్, సింగపూర్, కెమెన్ ఐలాండ్స్, వర్జిన్ ఐలాండ్ మీదుగా తిరిగిందని చెప్పారు. ఈ పోర్టల్‌ను నిర్వహించిన వాళ్లెవరూ భారతీయులు కాదన్న రేవంత్‌రెడ్డి…ఆర్థిక నేరాలకు పేరొందిన దేశాలు, సంస్థల చేతుల్లో మన రైతుల వివరాలు పెట్టారని మండిపడ్డారు. ఎంతో విలువైన సమాచారాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టిన కేసీఆర్‌ను శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజల్ని మోసం చేసి సమాచారం అంతా క్రిమినల్స్‌కు అందించారని అన్నారు. ఈ నేరాలకు ఏం శిక్ష విధించాలో తెలియాలంటే చట్టాలన్నీ చదవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. డజన్ల కొద్ది కంపెనీలు ధరణిలోకి ఎందుకు వచ్చాయని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇవన్నీ తాము ఎన్నికల ముందు చెబితే.. తమనే బంగాళాఖాతంలో కలపాలని మాట్లాడారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
Read Also: Supreme court: చట్టాలు భర్తలను దోచుకునే సాధనాలు కాదు.. భరణంపై సుప్రీం కీలక వ్యాఖ్య
భూభారతి చట్టంతో.. ధరణి ఎదురైన సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అటవీ, రెవెన్యూ శాఖల భూములకు సంబంధించిన సరిహద్దుల వివాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. భూభారతి చట్టంతో ధరణి సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు. ధరణిలోని నిషేధిత భూముల జాబితాకు సంబంధించి పూర్తిస్థాయిలో పరిశీలన జరిపిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అటవీ ప్రాంతాలను ఆనుకొని ఉన్న భూముల సరిహద్దుల సమస్య పరిష్కారానికి త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి రైతులను.. తమ భూములకు దూరం చేస్తే…భూభారతి చట్టం మాత్రం రైతులను దగ్గర చేస్తుందన్నారు రేవంత్‌రెడ్డి. సీఎంకు, రెవెన్యూ శాఖకు మధ్య గోప్యంగా ఉండాల్సిన సమాచారాన్ని ఎందుకు దేశాలు దాటించారని ప్రశ్నించారు. వాళ్లు ఒక్క క్లిక్ చేస్తే చాలు సమాచారం అంతా క్రాష్ అవుతుందని చెప్పుకొచ్చారు.