తెలుగు రాష్ట్రాలపై ‘కరువు’ మేఘం కమ్మేస్తోంది. బ్రేక్ మాన్ సూన్ తరహా వాతావరణం కలవరపాటుకు గురిచేస్తోంది. సీజన్లో అత్యంత కీలకమైన జూలై తీవ్ర నిరాశపరిచింది. ఇప్పటికే 10 శాతం వర్షపాతం లోటు నమోదవ్వగా.. వచ్చే వారం పది రోజులు చాలా కీలకమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈలోగా వర్షాలు కురిసి సాధారణ స్ధితికి రాకపోతే పంటలు దెబ్బతినే అవకాశాలు బాగా పెరుగుతాయి. ఈ ఏడాది 9 రోజులు ముందుగానే రుతుపవనాలు వచ్చినప్పటికీ రైతులకు అవసరం అయిన సమయంలో వానలు లేకుండా పోయాయి. అల్పపీడనాల ఫ్రీక్వెన్సీ తగ్గిపోవడం నైరుతిలో లోటు వర్షపాతానికి ఒక కారణంగా భావిస్తున్నారు.
Also Read: YS Jagan: బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఎక్కువ ఉంటాయి.. సెన్సార్ వాళ్లకు చెప్పండి!
ప్రతుతం రాజస్థాన్ పరిసరాల్లో వాయుగుండం కొనసాగుతోంది. మరోవైపు ఉత్తర ఝార్ఖండ్, దక్షిణ బిహార్ పరిసరాల్లో తీవ్ర అల్పపీడనం సైతం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బుధ, గురువారాల్లో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు అవకాశముందని వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. రాబోయే మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. బుధ, గురువారాల్లో తేమ, ఉక్కపోత వాతావరణం కొనసాగే అవకాశముందని తెలిపింది. ప్రస్తుతం వర్షాల కోసం రైతాంగం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. కొన్నిచోట్ల వర్షాలు లేక పత్తి చెట్లు ఎండిపోతున్నాయి. మరోవైపు వరి నాటు వేసేందుకు వర్షం రైతులు చూస్తున్నారు.