TG SSC : తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు గుడ్‌న్యూస్. ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న TS 10వ తరగతి ఫలితాలు విడుదలకు తేదీ ఖరారైంది. విద్యాశాఖ ప్రకటించిన వివరాల ప్రకారం, ఏప్రిల్ 30న బుధవారం మధ్యాహ్నం 1 గంటకు పదో తరగతి ఫలితాలను విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాదులోని రవీంద్ర భారతిలో ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ ఏడాది మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించిన పదో తరగతి పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తయ్యింది. తాజా ఫలితాల ప్రకటనతో పాటు, ఈ సంవత్సరం మార్కుల మెమో రూపంలో కొన్ని కీలక మార్పులు చేపట్టారు. గతంలో విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా గ్రేడ్లు, సీజీపీఏలు మాత్రమే ఇచ్చే విధానానికి బదులుగా, ఈసారి రాత పరీక్షలు , ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కులను విడిగా చూపిస్తూ, మొత్తం మార్కులు , గ్రేడ్లను మెమోలో చేర్చనున్నారు. అలాగే, ఉత్తీర్ణత లేదా అప్రమత్తత (పాస్/ఫెయిల్) స్థితిని కూడా స్పష్టంగా పేర్కొననున్నారు.
ఇది మాత్రమే కాకుండా, విద్యార్థులు బోధనేతర కార్యకలాపాలలో చూపిన ప్రతిభను కూడా ప్రభుత్వం ప్రాధాన్యతగా భావించింది. వాల్యూ ఎడ్యుకేషన్, ఆర్ట్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషన్, వర్క్ అండ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ వంటి నాలుగు విభాగాల్లో విద్యార్థులకు గ్రేడ్లు ఇవ్వనున్నారు. ఈ వివరాలు కూడా మార్కుల మెమోలో ముద్రించనున్నట్లు అధికారులు తెలిపారు. ఫలితాలు విడుదలైన అనంతరం విద్యార్థులు తమ మార్కులు, గ్రేడ్లను తెలంగాణ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లు అయిన results.bse.telangana.gov.in, bse.telangana.gov.in లేదా manabadi.co.in ద్వారా చూసుకోవచ్చు. ఇలా చూస్తే, ఈసారి పదో తరగతి ఫలితాల ప్రకటన మరింత పారదర్శకంగా, సమగ్రమైన సమాచారంతో ఉండబోతోంది.
YCP: వైసీపీలో నూతన నియామకాలు.. పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు వీరే!