Site icon NTV Telugu

Asian Games 2023: టీమిండియా ఉమెన్స్ క్రికెట్ జట్టును వరించిన పసిడి

Womens Team

Womens Team

ఆసియా క్రీడలు 2023లో టీమిండియా ఉమెన్స్ క్రికెట్ జట్టు పసిడిని ముద్దాడింది. మహిళల క్రికెట్ ఈవెంట్ స్వర్ణ పతక పోరులో శ్రీలంకపై భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. అనంతరం బౌలర్ల అద్భుత ప్రదర్శనతో శ్రీలంకను 20 ఓవర్లలో 97 పరుగులకే పరిమితం చేసి భారత్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. భారత బౌలింగ్‌లో 18 ఏళ్ల టైటాస్ సాధు అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టింది. రాజేశ్వరి గైక్వాడ్‌ 2 వికెట్లు తీసింది. ఇక టీమిండియా బ్యాటింగ్‌లో.. జెమిమా రోడ్రిగ్జ్ 42, స్మృతి మంధాన 46 పరుగులతో జట్టును ఆదుకున్నారు.

Team India: మ్యాచ్ అనంతరం ఇంట్రెస్టింగ్ సన్నివేశం.. వీడియో ఇదిగో..

117 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు.. కెప్టెన్ చమరి అటపట్టు తొలి ఓవర్‌లోనే వేగంగా ఆడి 12 పరుగులు చేసింది. ఆ తర్వాత బౌలింగ్ కు దిగిన టైటాస్‌ సాధు.. తొలి బంతికే అనుష్క సంజీవని వికెట్‌ తీసి 13 పరుగుల వద్ద శ్రీలంక జట్టుకు తొలి దెబ్బ అందించింది. అదే ఓవర్లో నాలుగో బంతికి విష్మీ గుణరత్నేను డకౌట్ రూపంలో పెవిలియన్ బాట పట్టించింది. వరుసగా 2 వికెట్లు కోల్పోవడంతో శ్రీలంక జట్టుపై ఒత్తిడి పెరిగింది. టైటాస్ తన రెండో ఓవర్‌లో 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శ్రీలంక కెప్టెన్ చమరి అటపట్టును ఔట్ చేసింది. దీంతో శ్రీలంక తొలి 6 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 28 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Madhu Yashki Goud: పాతవారిని పక్కనబెట్టి.. కొత్తవారికి సీట్లు ఇవ్వడం కాంగ్రెస్ ఆనవాయితీ కాదు..!

ఇక ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన హాసిని పెరీరా, డిసిల్వా శ్రీలంక ఇన్నింగ్స్‌ను కాస్త పరుగులు పెట్టించారు. వారిద్దరి మధ్య 33 బంతుల్లో 36 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. శ్రీలంక 50 పరుగుల వద్ద హాసిని పెరీరాను రాజేశ్వరి గైక్వాడ్ ఔట్ చేసింది. ఇక్కడి నుంచి శ్రీలంకను టీమిండియా బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. ఆ తర్వాత పూజా వస్త్రాకర్ బౌలింగ్‌లో డిసిల్వాను ఔట్ చేసింది. దీంతో శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసి 19 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. భారత బౌలింగ్‌లో టిటాస్ సాధు 3 వికెట్లు తీయగా, రాజేశ్వరి గైక్వాడ్ 2, దీప్తి శర్మ, దేవికా వైద్య, పూజా వస్త్రాకర్ తలో వికెట్ తీశారు.

Exit mobile version