NTV Telugu Site icon

Andhra Pradesh: వార్డెన్‌, ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయుడి కీచక పర్వాలు.. విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన

Physical Harassment

Physical Harassment

Andhra Pradesh: విద్యార్థులకు దిశానిర్ధేశం చేయాల్సిన ఉపాధ్యాయుడు వృత్తికే మాయని మచ్చలా ప్రవర్తించాడు. విద్యా బుద్ధులు నేర్పించి, సమాజంలో మంచి పౌరుడిగా తీర్చి దిద్దాల్సిన టీచర్.. కీచకుడిగా వ్యవహరించాడు. తిరుపతి జిల్లాలో కీచక ఉపాధ్యాయుడి బాగోతం ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పదో తరగతి చదువుతున్న అమ్మాయిలపై అసభ్య ప్రవర్తించిన ఈ ఘటన రేణిగుంట మండలం ఆర్ మల్లవరం ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు రవిపై విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేశారు. ప్రధానోపాధ్యాయుడు చర్యలు తీసుకుంటామని చెప్పడంతో తల్లిదండ్రులు వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో నా పైనే ఫిర్యాదు చేస్తారా అంటూ ఉపాధ్యాయుడు విద్యార్థులపై ఆగ్రహం వ్యక్తి చేయడంతో పాటు ఇంటికి వెళ్ళి విద్యార్థుల తల్లిదండ్రులను బెదిరించాడు. విషయం బయటకి రావడంతో జిల్లా విద్యా శాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. డిప్యూటీ డీఈవో, ఎంఈఓ పాఠశాలలో విచారణ చేపట్టారు. కీచక టీచర్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థినుల పైనే కాకుండా సహచర ఉపాధ్యాయులపై కూడా ఉపాధ్యాయుడు రవి అసభ్య ప్రవర్తన విషయం విచారణలో వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో ఆయనపై అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Read Also: Attack on GirlFriend: పెళ్లికి నిరాకరించిందని యువతిపై కత్తితో దాడి

మరో ఘటనలో ఏలూరు బాలికల హాస్టల్ లో విద్యార్థినులపై వార్డెన్ భర్త శశికుమార్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలికల నుంచి వివరాలు సేకరించిన పోలీసులు ప్రత్యేక బృందాల ద్వారా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేటు హాస్టల్‌లో చోటు చేసుకున్న ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్‌గా దృష్టి సారించారు. హాస్టల్ లో పొందుతున్న దాదాపు 45 మంది విద్యార్థినిలు హాస్టల్ ఖాళీ చేసి ఇళ్లకు వెళ్లిపోయారు. ఏలూరు బాలికల హాస్టల్ లో విద్యార్థినిలను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వార్డెన్ శశి కుమార్‌ను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్‌లో  ఎర్రగుంటపల్లి హాస్టల్ వార్డెన్‌గా బొమ్మిరెడ్డిపల్లి శశి కుమార్ పనిచేస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ప్రైవేట్ హాస్టల్లో తన భార్య ఫణిశ్రీని  శశి కుమార్ మ్యాట్రీన్ గా ఉంచాడు. భార్య పేరు చెప్పి హాస్టల్లో ప్రవేశించి విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు శశి కుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ముగ్గురు బాలికలు ఫిర్యాదు చేయగా.. విచారణలో మరో ఐదుగురు బాధితులు పిర్యాదు చేసినట్టు సమాచారం..

మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరం ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణపై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు‌. ఈ మేరకు గంగవరం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణ తాను స్కూల్ ప్రక్కన ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని హాస్టల్ గదుల్లోకి వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని సమాచారం. ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణ అసభ్యకరంగా మాట్లాడాడని, మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నారని విద్యార్థినులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో కీచక ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణను ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కట్ట సింహాచలం సస్పెండ్ చేశారు. దీనిపై గంగవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణలో గత కొంతకాలంగా ఐదుగురు ఇంటర్మీడియట్ చదువుతున్న బాలికలపై రామకృష్ణ లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నట్లు నిర్ధారణ కావడంతో గంగవరం పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు రామకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని రిమాండ్ కు పంపనున్నారు. విద్యార్థినులపై వేధింపులకు పాల్పడటాన్ని పలువురు గిరిజన సంఘం నాయకులు మండిపడుతున్నారు.

Show comments