Bhatti Vikramarka: హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వం విద్యా శాఖ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన రవీంద్ర భారతిలో గురు పూజోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. రాష్ట్ర స్థాయిలో ఎంపికైన 41 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అవార్డులు ప్రదానం చేశారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. విద్యను, గురువులను గౌరవించేది కాంగ్రెస్ మాత్రమేనని వ్యాఖ్యానించారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతోనే ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించామన్నారు. మరో 6 వేల ఉపాధ్యాయ పోస్టుల కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని డిప్యూటీ సీఎం ప్రకటించారు.
Read Also: Shabbir Ali: ఇండోర్ స్టేడియం నిర్మాణానికి షబ్బీర్ అలీ శంకుస్థాపన
ఈ సందర్భంగా రాష్ట్రంలోని 27, 862 విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రకటించారు. ఇవాల్టి నుండే అమలు చేస్తున్నామని.. జీవో కూడా విడుదల చేశామన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఇంకా మారాల్సి ఉందని.. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచేందుకు స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ఐటీఐలను అడ్వాన్స్‌డ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోదండరాంను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు , ఎమ్మెల్యేలు కోదండరాం, నర్సిరెడ్డి, రఘోత్తం రెడ్డి , ఏవీఎన్ రెడ్డి, ఉన్నత విద్య మండలి చైర్మన్ లింబాద్రి, విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం, కమిషనర్లు దేవసేన , శృతి ఓజా , ఈవీ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.